ఇండియన్ ఐ డ్రాప్స్ తో అమెరికాలో ఒకరు మృతి

ఇండియన్ ఐ డ్రాప్స్ తో అమెరికాలో  ఒకరు మృతి

ఇండియాకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ తయారు చేసిన ఎజ్రీకేర్ ఆర్టిఫిషియల్ టియర్స్ ఐడ్రాప్స్ అమెరికాలో కలకలం సృష్టించాయి. ఈ ఐడ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరు మరణించగా.. మరికొంతమందికి కంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ఎజ్రీకేర్ ఐడ్రాప్స్ ను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎజ్రీకేర్ వల్ల యూఎస్ లోని 55 మందికి కంటి సమస్యలు తలెత్తాయి. అందులో ఒకరు మరణించగా.. ఐదుగురు కంటి చూపును కోల్పోయారని అమెరికా సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. ఆ వికటించిన ఐ డ్రాప్స్‌లో సూడోమోనాస్‌ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు నిపుణుల పరిశీలనలో తేలింది. 

ఈ బ్యాక్టీరియా ఐ డ్రాప్స్‌ వేసుకోగానే బాధితుల ఊపితిత్తులు, కాలేయం తదితర అవయవాల్లో ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తున్నదని రుజువైంది. దీనిపై అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏతోపాటు కేంద్ర, తమిళనాడు ఆరోగ్య శాఖల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. కాగా ఆర్టిఫిషియ‌ల్ టియ‌ర్స్‌ను వాడ‌డం ఆపివేయాల‌ని అమెరికా ప్ర‌జ‌ల‌కు గ్లోబ‌ల్ ఫార్మా కంపెనీ సూచ‌న చేసింది. టియ‌ర్ డ్రాప్స్ తీసుకుని ఇబ్బందులు ప‌డుతున్నవారు వెంట‌నే మెడిక‌ల్ హెల్ప్ తీసుకోవాల‌ని కోరింది.