Mpox Virus ఎంట్రీ ఇచ్చేసింది.. భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

Mpox Virus ఎంట్రీ ఇచ్చేసింది.. భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

ఢిల్లీ: ఆఫ్రికా దేశాలను బెంబేలెత్తిస్తున్న మంకీపాక్స్ భారత్లో కూడా ప్రవేశించింది. విదేశాల వెళ్లి భారత్కు తిరిగొచ్చిన ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మంకీపాక్స్ బారిన పడినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ నిర్ధారించింది. ల్యాబ్ పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్రం పేర్కొంది. వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ 2 రకం వైరస్ అతనికి సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. ఈమేరకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది.

భారత్ లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణమైన క్లేడ్ 1 మంకీపాక్స్ రకం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం మంకీపాక్స్ సోకిన ఆ యువకుడిని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అందువల్ల వైరస్ వ్యాప్తికి అవకాశం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి మంకీపాక్స్ వ్యాప్తి సంకేతాలు భారత్లో లేవని కేంద్రం వెల్లడించింది.

ALSO READ | భారత్లో తొలి Mpox కేసు..? ఐసోలేషన్లో విదేశాలనుంచి వచ్చిన వ్యక్తి

మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్. మశూచి లాంటిదే మంకీపాక్స్ కూడా. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని కొనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి రోగులను గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరుకుంది. మంకీపాక్స్ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా ఇవి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 2-4  వారాలపాటు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.

మంకీపాక్స్ సోకిన జంతువు కరవడం, రక్తం, శరీర ద్రవాలు, జంతువుల యొక్క జుట్టును తాకడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకవచ్చు. ఇది ఎలుకలు, ఉడుతలు వంటి వాటి ద్వారాకూడా మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. దీనికితోడు వ్యాధి సోకిన జంతువు నుండి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం ద్వారా కూడా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంది. దద్దుర్లు ఉన్నవారు ఉపయోగించే దుస్తులు,పరుపు, తువ్వాలను తాకడం ద్వారా మరొకరికి సోకుతుంది.  మంకీపాక్స్ వ్యాధి సోకిన వారు చనిపోయే అవకాశాలు తక్కువే. చిన్న పిల్లలు, వృద్ధులకు ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది.