
సంపన్న వర్గాలకు చెందిన ప్రజలు తమ డబ్బును ఎక్కడ పెడితే సేఫ్ అనే దానిలో ఉన్న రిస్క్ కొద్దిగా పక్కన పెట్టి.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడిని పొందవచ్చు అనే దృష్టిలో ఆలోచించటం పెంటారు. ఈ క్రమంలోనే సంపన్నులకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను మార్చుకుంటూ క్రిప్టోకరెన్సీల వైపు మళ్లుతున్నాయి. స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, బంగారం, స్థిర ఆదాయ సాధనాలు ఆశించిన రాబడిని ఇవ్వకపోవడంతో వారు బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింతగా పెరిగింది.
ఒకప్పుడు క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన భారతీయ సంపన్న వర్గాలు.. ఇప్పుడు వాటిని తమ పోర్ట్‌ఫోలియోలలో ఎలా చేర్చుకోవాలి, ఏ టోకెన్‌లను కొనుగోలి, వాటిని ఎలా భద్రపరచాలి అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీలు కూడా భారతీయ సంపన్నుల నుంచి ట్రేడింగ్ వాల్యూమ్‌లలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తున్నట్లు చెబుతున్నాయి. తమ మెుత్తం ట్రేడింగ్ వాల్యూమ్ లో దాదాపు సగం 3500 సంపన్న కుటుంబాల ఫ్యామిలీ ఆఫీసుల ఖాతాల నుంచే చూస్తున్నట్లు ఒక ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ పేర్కొంది.
ప్రస్తుతం సంపన్న వర్గాలు తమ డబ్బును దీర్ఘకాలిక వ్యూహంతో క్రిప్టోల్లోకి తరలిస్తున్నాయి. ఈ మార్పు కేవలం లాభాల కోసమే కాదు, బ్లాక్‌చెయిన్ ఆధారిత సాంకేతికతలు, వికేంద్రీకృత ఫైనాన్స్ రంగాలలోకి ప్రవేశించడానికి కూడా జరుగుతోంది. వీటిని భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా వీరు మారుతున్నారు.
ఇటీవలి వారాల్లో బిట్‌కాయిన్ లక్ష 20వేల డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలోనే దాదాపు 90% లాభాలను అందించింది. ఎథీరియం, ఇతర ఆల్ట్‌కాయిన్‌లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. సంప్రదాయ పెట్టుబడి మార్గాలలో పెద్దగా ఉత్సాహం లేని సమయంలో క్రిప్టోకరెన్సీల అద్భుతమైన పనితీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, ఖరీదైనవిగా, అస్థిరమైనవిగా మారటం.. మరో పక్క బాండ్లు ఆకర్షణీయమైన రాబడిని ఇవ్వడానికి కష్టపడుతున్నాయి. ఇక సేఫ్ హెవెన్ గోల్డ్ స్వల్ప లాభాలనే అందిస్తున్న క్రమంలో క్రిప్టోలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి.
అంతర్జాతీయ సంకేతాలు కూడా భారతీయ పెట్టుబడిదారులను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలోని రాజకీయ పరిణామాలు, రిపబ్లికన్ అభ్యర్థుల నుంచి క్రిప్టోకు బలమైన మద్దతు.. డిజిటల్ ఆస్తులపై విశ్వాసాన్ని పెంచాయి. అమెరికాలో బిట్‌కాయిన్ ETFల ఆమోదం ఈ రంగానికి మరింత చట్టబద్ధతను కల్పించి, సంస్థాగత పెట్టుబడులను సులభతరం చేసింది.
అయితే ఈ పెట్టుబడి మార్గం సవాళ్లతో నిండి ఉంది. డిజిటల్ ఆస్తులపై భారత పన్ను విధానం ప్రధాన అడ్డంకిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. మూలధన లాభాలపై 30% పన్ను, ప్రతి క్రిప్టో లావాదేవీపై 1% TDS రిటైల్ పెట్టుబడిదారులలో చాలా మందిని విదేశాలకు లేదా అండర్‌గ్రౌండ్ లావాదేవీల వైపుకు మళ్లిస్తోంది. కఠినమైన నియమాలు ఆవిష్కరణలను అణిచివేసి, మూలధనాన్ని భారతదేశం నుంచి బయటకు నెట్టివేస్తున్నాయని వాదిస్తూ.. క్రిప్టో పరిశ్రమ పన్ను సంస్కరణల కోసం చురుకుగా లాబీయింగ్ చేస్తోంది. ప్రభుత్వం తన వైఖరిని సడలిస్తే, దేశీయ భాగస్వామ్యం మరింత పెరుగుతుంది.