కూల్​డ్రింక్స్​కు ఫుల్లు గిరాకీ

కూల్​డ్రింక్స్​కు ఫుల్లు గిరాకీ

న్యూఢిల్లీ: కూల్ ​డ్రింక్స్, స్క్వాష్‌‌లు, పౌడర్డ్ మిక్స్‌‌లు,  ప్యాకేజ్డ్ జ్యూస్‌‌లు వాడే కుటుంబాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటికి డిమాండ్​ పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. మనదేశంలో  కూల్​ డ్రింక్స్ వాడకం​ 2019 లో 38శాతం వృద్ధి చెందగా, ఈ ఏడాది మేలో 47శాతం వృద్ధిని (హోం పెనెట్రేషన్) సాధించిందని ఒక సర్వేలో తేలింది.  వీటి సగటు ఇంటి వినియోగం 2019లో 6.5 లీటర్ల నుండి సంవత్సరానికి కేవలం 7 లీటర్లకు పెరిగింది. మార్కెటింగ్ డేటా  అనలిటిక్స్ కంపెనీ కాంతర్ ప్రకారం.. ఈ 47 శాతం హోం పెనెట్రేషన్ కరోనాకు ముందు 12 నెలల కంటే మెరుగ్గా ఉంది. 2020,  2021 వేసవిలో ఈ రంగం కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంది. 2022లో బలమైన పనితీరు కనిపించింది. 

2023లో అమ్మకాలు బాగా పెరిగాయని కాంతర్​ వరల్డ్‌‌ ప్యానెల్ డివిజన్ ఎండీ రామకృష్ణన్ అన్నారు.  కుటుంబాలు కూల్​ డ్రింక్స్​ కోసం తరచుగా షాపింగ్ చేస్తున్నాయి. ఇవి 2019లో 5.5 సార్లు ఎక్కువగా బాటిల్స్​ కొనగా, ప్రస్తుతం ఇది 6.5 సార్లకు (సగటు) పెరిగింది. జనాల్లో కూల్ ​డ్రింక్స్​ తాగే అలవాటు నాటుకు పోయిందని  రామకృష్ణన్ ​చెప్పారు. చల్లని డ్రింక్స్​ తాగే అన్ని కుటుంబాలూ బాటిల్డ్​ సాఫ్ట్ ​డ్రింక్స్​ను కొంటున్నాయి. ఇండ్లలో వీటి పెనెట్రేషన్​ 45 శాతం వరకు ఉంది. ఈ విషయంలో జ్యూసుల వాటా ఐదు శాతాన్ని మించడం లేదు.  స్క్వాష్‌‌ల వాటా 6 శాతం ఉంది. 

ఎండాకాలం కీలకం..

సీజన్‌‌లపై ఎక్కువగా ఆధారపడే కూల్​ డ్రింక్స్​ రంగం 2019 మార్చి–-మేలో 29శాతం పెరిగింది. అధిక వర్షాలు ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం మార్చి–-మేలో 37శాతం వృద్ధిని సాధించింది. ఈ సంఖ్యలు 2019 సంవత్సరం అమ్మకాలకు దగ్గరగా ఉన్నాయి. ఫ్రూటీని తయారుచేసే పార్లే ఆగ్రో జాయింట్ ఎండీ నదియా చౌహాన్ మాట్లాడుతూ, 2019 నుంచి కస్టమర్ల ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని, ప్రధానంగా కరోనా ప్రభావం కారణంగా వీటి వాడకం పెరిగిందని చెప్పారు. పెద్ద ప్యాక్​లకు, షేర్డ్ ప్యాక్‌‌లకు గిరాకీ భారీగా పెరిగిందని వివరించారు. మీటింగ్స్​తో పాటు ఇంట్లో వాడుకోవడానికీ భారీగా సాఫ్ట్ ​డ్రింక్స్​ను కొంటున్నారని ఆమె చెప్పారు. ఫ్రూటీ అమ్మకాలు 2019తో పోలిస్తే 2023 సంవత్సరం నాటికి బాగా పెరిగాయి. 

పెద్ద ప్యాక్‌‌ల అమ్మకాలు దాదాపు 45శాతం పెరిగాయి.   కస్టమర్లు తమ డబ్బుకు మెరుగైన విలువను కోరుతున్నారని నదియా అన్నారు. అన్ని రకాల అవసరాలను తీర్చగల మధ్యతరహా ప్యాక్‌‌ల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. అయినప్పటికీ, కూల్​డ్రింక్స్​ పరిశ్రమలో బాటిల్ కూల్​డ్రింక్స్  వేసవిలో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. కరోనాకు ముందు, మార్చి,-మే నెలలు వార్షిక అమ్మకాల్లో 40శాతం వాటా అందించాయి.  అయితే ఈ ఏడాది మార్చి–-మేలో  కూల్​డ్రింక్స్​ సగటు కొనుగోలు పరిమాణం 4.1 లీటర్ల నుండి 3.8 లీటర్లకు పడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఎండలు పెద్దగా లేకపోవడం ఇందుకు కారణాలు. ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో కురిసిన అకాల వర్షాల వల్ల భారతదేశ వ్యాపారం బాగా దెబ్బతిందని కోకా-కోలా పేర్కొంది. అయినప్పటికీ వార్షిక అమ్మకాల్లో -జూన్ క్వార్టర్​సేల్స్​వాటా 40 శాతం ఉందని తెలిపింది.