Sensex Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇండియన్ ఈక్విటీలపై బేర్స్ పంజాకు కారణాలు ఇవే..

Sensex Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇండియన్ ఈక్విటీలపై బేర్స్ పంజాకు కారణాలు ఇవే..

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో అత్యధికంగా 800 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 2.27 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీల పనితీరును గమనిస్తే.. సెన్సెక్స్ 760 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 265 పాయింట్లు లాస్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 660 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 1300 పాయింట్ల భారీ నష్టంలో కొనసాగుతోంది. 

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ నష్టం కారణంగా దాదాపు ప్రతి సెక్టార్ నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలో భారీగా కొనసాగుతున్న ప్రాఫిట్ బుక్కింగ్ వాటి పతనానికి దారితీసినట్లు తేలింది. చాలా కంపెనీల షేర్లు దాదాపు 10 శాతం మేర తగ్గుదలను నమోదు చేశాయి. అయితే మార్కెట్లలో బేర్స్ పంజాతో క్రాష్ కి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

1.US ఫెడ్ రేట్ల తగ్గింపు ఆశలు: 
డిసెంబర్ 9న ప్రారంభమయ్యే US ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కోతలపై అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సైడ్‌లైన్స్‌లో ఉండిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల కోతలు ఎప్పుడు ఉంటాయనే దానిపై నెలకొన్న గందరగోళం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది.

2. స్మాల్-మిడ్‌క్యాప్ షేర్లలో అమ్మకాలు: 
గత కొంతకాలంగా దూసుకుపోయిన స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ షేర్లలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. Nifty Smallcap100 సూచీ వరుసగా ఐదో సెషన్‌లో క్షీణించగా, ఇంట్రా-డే ట్రేడ్‌లో 2 శాతం పడిపోయింది. ఈ అమ్మకాల ఒత్తిడి ఇప్పుడు లార్జ్-క్యాప్‌ షేర్లపైనా పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో డిఫెన్స్, రెన్యువబుల్స్ వంటి కొన్ని రంగాలు తీవ్రమైన ఒత్తిడిని చూస్తున్నాయి.

 

►ALSO READ | ఇండిగో సంక్షోభానికి 2 కీలక కారణాలు.. రెండు నెలల్లో 1000 మంది పైలట్స్ కావాలంట..?

 

3. FII అమ్మకాలు: 
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FIIs) వరుసగా 7వ సెషన్‌లో కూడా అమ్మకాలు కొనసాగించారు. శుక్రవారం నాడు రూ.438.90 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం, ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా FIIలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

4. రూపాయి బలహీనత.. క్రూడ్ పెరుగుదల: 
రూపాయి మారకం విలువ US డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలహీనపడి రూ.90.11 వద్దకు చేరుకుంది. అదే సమయంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు (బ్రెంట్ క్రూడ్) 0.13 శాతం పెరిగి 63.83 డాలర్లకు చేరాయి. ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ దిగుమతి బిల్లులను పెంచి, ద్రవ్యోల్బణ ఆందోళనలకు దారితీస్తుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

5. ఇండియా VIX అప్: 
మార్కెట్ అనిశ్చితిని సూచించే ఇండియా VIX సూచీ 2.11 శాతం పెరిగి 10.53కు చేరింది. VIX పెరుగుదల అంటే మార్కెట్‌లో అనిశ్చితి పెరిగిందని అర్థం. దీంతో ట్రేడర్లు రిస్క్ తీసుకోవడం తగ్గిస్తారు. మెుత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత ఆర్థిక వాతావరణం భారత ఈక్విటీ ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తోంది. దీంతో వారు సేఫ్ గేమ్ ఆడుతూ లాభాలను బుక్ చేసుకుంటున్నారు.