- ఎన్‌టీఎఫ్‌కు ఐఎంఏ మరోసారి లేఖ
- హాస్పిటల్స్‌ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా డాక్టర్లు, హాస్పిటల్స్ పై దాడులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినమైన కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మరోసారి డిమాండ్ చేసింది. డాక్టర్లు, దవాఖాన్లలో భద్రత అంశంపై సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్ టీఎఫ్)కు ఐఎంఏ శనివారం మరో లేఖ రాసింది. ‘నైట్ డ్యూటీలో సేఫ్టీ’ అనే అంశంపై దేశవ్యాప్తంగా 3,885 మంది డాక్టర్లతో నిర్వహించిన సర్వే రిపోర్టును కూడా ఎన్ టీఎఫ్ కు సమర్పించింది.
కఠినమైన కేంద్ర చట్టం ద్వారానే అన్ని రాష్ట్రాల్లో డాక్టర్లు, దవాఖాన్లపై దాడులను నివారించవచ్చని తెలిపింది. ఇలాంటి చట్టం లేనందుకే రాష్ట్రాల్లో పోలీసులు, అధికారుల దర్యాప్తు నిర్లక్ష్యంగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే సరైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు గాను హాస్పిటల్స్ ను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. దవాఖాన్లలో డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ఉండేందుకు, పని చేసేందుకు సౌలతులు మెరుగుపర్చాలని కోరింది.