కరోనా డేటాతోనే జనాల్లో భయం

కరోనా డేటాతోనే జనాల్లో భయం

రోజూ కొవిడ్​ కేసుల వివరాలను వెల్లడిస్తుండడంతో జనాలు భయపడుతున్నారని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ) పేర్కొంది. కేసుల డేటాను రహస్యంగా ఉంచాలని, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొవిడ్​ కట్టడిలో భాగమైన ప్రతి డాక్టర్​ నమ్మదగిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలని, తద్వారా జనాల్లో ధైర్యం నింపి నమ్మకం కలిగించాలని సూచించింది. చైనాలో ఉన్నతాధికారుల హంగామా వల్లే ప్రపంచమంతా కరోనాపై భయం కమ్ముకుందని చెప్పింది. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాపై బ్యాలెన్స్​డ్​ చర్యలు తీసుకుంటోందని చెప్పింది. వైరస్​ వ్యాప్తిపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలూ బాగున్నాయని,  ఒత్తిడిని తట్టుకుని పనిచేస్తున్నాయంది. టీబీ (క్షయ) వంటి జబ్బులను గుర్తించడానికి కొవిడ్​ను అవకాశంగా మలచుకోవాలని, అంతేగాకుండా చేతులను కడుక్కోవడం ఎంత ముఖ్యమో జనాల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

62కు పెరిగిన కేసులు

దేశంలో బుధవారం సాయంత్రానికి కొవిడ్​ కేసులు 62కు పెరిగాయి. జైపూర్, జమ్మూకాశ్మీర్​, ఢిల్లీల్లో తాజాగా కేసులు నమోదయ్యాయి. కేరళలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న 85 ఏళ్ల వృద్ధురాలి పరిస్థితి సీరియస్​గా ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటిదాకా నమోదైన కొవిడ్​ కేసులు 50 మాత్రమేనని కేంద్రం చెబుతోంది. పాజిటివ్​ కేసులు నమోదైన రాష్ట్రాల నుంచి టైంకు డేటా అందకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల సంఖ్యలో తేడాలుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. కొవిడ్​ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వాళ్లు ఇంట్లోనే ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. చైనా, ఇటలీ, ఇరాన్​, కొరియా, జపాన్​, ఫ్రాన్స్​, స్పెయిన్​, జర్మనీ వంటి దేశాలకు వెళ్లకపోవడమే మంచిదని పేర్కొంది. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలేవో చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మార్చి 30 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే స్కూళ్లు బంద్​పెట్టిన లడఖ్​.. ఇప్పుడు కాలేజీలకూ ఆ సెలవులను పొడిగించింది. ఇటు శ్రీనగర్​లోనూ అన్ని విద్యా సంస్థలు, స్టేడియాలను బంద్​పెడుతూ జమ్మూకాశ్మీర్​ ఆదేశాలిచ్చింది. కొవిడ్​ నేపథ్యంలో తమకు బ్రీత్​ అనలైజర్​ టెస్టుల నుంచి మినహాయింపునివ్వాలని ఎయిరిండియా పైలట్లు డీజీసీఏని కోరారు. ఈ మేరకు డీజీసీఏ చీఫ్​కు లెటర్​ రాశారు. ఇంటర్నేషనల్​ విమానాలను నడిపే పైలట్లకు ఈ టైంలో బ్రీత్​ అనలైజర్​ టెస్టులు చేయడం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. డెల్, మైండ్​ట్రీ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్​ వచ్చినట్టు కంపెనీలు చెప్పాయి.

ఇటలీ నుంచి 135 మంది వచ్చిన్రు

కొవిడ్​ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇటలీ నుంచి 135 మంది ఇండియన్లు సొంత దేశానికి తిరిగొచ్చేశారు. 83 మంది ఎయిరిండియా ఫ్లైట్​ మనేసర్​కు రాగా అందరినీ అక్కడి ఆర్మీ ఫెసిలిటీలో క్వారెంటైన్​ చేశారు. మరో 52 మంది కేరళలోని కొచ్చిన్​కు చేరుకున్నారు. 35 మందిని అళువా డిస్ట్రిక్ట్​ హాస్పిటల్​లో క్వారెంటైన్​ చేశారు. అందులో ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు గర్భిణులున్నారు.

అందరినీ తీసుకొచ్చేస్తం

ఇటలీ, ఇరాన్​లలో చిక్కుకున్న ఇండియన్లందరినీ తిరిగి తీసుకొచ్చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ చెప్పారు. ఆయా దేశాల్లో చిక్కుకున్న ఇండియన్లకు టెస్టులు చేసేందుకు మెడికల్​ టీం గురువారం వెళుతుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంటున్న ఇండియన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే, జనాల్లో లేనిపోని భయాలు సృష్టించినట్టవుతుందని ఆయన చెప్పారు. ఇరాన్​లో 6 వేల మందికిపైగా చిక్కుకున్నారన్నారు. మంగళవారం ఇరాన్​ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 58 భక్తులకు కొవిడ్​ లేదన్నారు. ఇరాన్​ నుంచి తెచ్చిన 529 శాంపిళ్లను పుణేలోని ఎన్​ఐవీ టెస్ట్​ చేస్తోందని, అందులో 107 నెగెటివ్​ వచ్చాయన్నారు. చెన్నైలో దక్షిణ కొరియా వాళ్లను ఇంటి ఓనర్లు ఖాళీ చేయిస్తున్నారు.

ఇటలీలో సీరియస్​

ఇటలీలో రోజురోజుకూ కొవిడ్​ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ 10,149 కేసులు నమోదవగా, 631 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 1,21,487 కేసులు నమోదవగా, 4,382 మంది చనిపోయారు. చైనాలో 80,788 కేసులు నమోదయ్యాయి. 3,158 మంది చనిపోయారు. ఇరాన్​లో 9 వేల కేసులు, 354 మరణాలు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో 61 మంది, స్పెయిన్​లో 49, ఫ్రాన్స్​లో 33, జపాన్​లో 12 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 31కి పెరిగింది. 1,016 కేసులు నమోదయ్యాయి.