నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వండి .. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ, టీజేఎస్ విజ్ఞప్తి

నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వండి ..  సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ, టీజేఎస్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:  ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించే నామినేటెడ్ పోస్టుల్లో తమకూ అవకాశం ఇవ్వాలని సీపీఐ, టీజేఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. కోడ్ తరువాత మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం కావడతో.. ఈ దఫా తమకూ కొన్ని పదవులు ఇవ్వాలని సీఎంకు ఆ పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు ఈ పార్టీల నేతలు సీఎంను కలిసిన సందర్భాల్లో నామినేటెడ్ పోస్టుల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో సైతం సీపీఐ తమకు ఒకటి లేదా రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరింది. కానీ బీజేపీని ఓడించాలంటే తమ అభ్యర్థులే పోటీలో ఉండాలని సీపీఐని కాంగ్రెస్ ఒప్పించింది. 

దీంతో సీపీఐ ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గింది. అన్ని సీట్లలో సీపీఐ నేతలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని సీఎంను కలిసిన సందర్భాల్లో ఆ పార్టీ నేతలు గుర్తుచేసినట్టు చెప్తున్నారు. పొత్తులో భాగంగా సీపీఐకి ఎమ్మెల్సీతోపాటు కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే వచ్చే ఏడాది వరకు ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వకపోవటంతో కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో చాన్స్ ఇవ్వాలని సీపీఐ నేతలు కోరుతున్నారు.  

రెండు పార్టీల్లో పదవుల కోసం పోటీ

సీపీఐలో మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని రత్నాకర్ రావు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, పశ్య పద్మ, బాల మల్లేశ్​ పలువురు రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులతో పాటు జిల్లాల్లో కొంత మంది కీలక నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. రాష్ట్ర నేతలకు రాష్ట్ర స్థాయిలో జిల్లా నేతలకు జిల్లా స్థాయిలో పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక టీజేఎస్ చీఫ్  కోదండరాం ఇప్పటికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పేరు పంపగా అది పెండింగ్ లో ఉంది. కోడ్ ముగిసిన తరువాత ఎమ్మెల్సీకి గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. టీజేఎస్ లో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ పొత్తులో భాగంగా వెనక్కి తగ్గిన బైరి రమేశ్, నిజ్జన రమేశ్, ధర్మార్జున్, నర్సయ్య, వినయ్ కుమార్ తో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి కోదండరాం వెనకే ఉన్నారు. అందుకే వీరికి అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరుతున్నారు. 

రెండో లిస్ట్ పై సీఎం కసరత్తు

ఎన్నికలకు ముందు 37 మందికి నామినేటెడ్ పోస్టుల లిస్ట్ ప్రకటించగా రెండో లిస్ట్ లో మరికొందరికి అవకాశం కల్పించనున్నారు. తొలి దశలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసి పోటీకి దూరంగా ఉన్న వాళ్లు, పార్టీ అనుబంధ సంఘ నేతలకు అవకాశం ఇచ్చారు. రెండో దశ లిస్ట్ పై పోలింగ్ ముగిసినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు సంస్థల అధిపతుల పోస్టులకు కాంగ్రెస్ నేత కోదండరెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి పేర్లను సీఎం పరిశీలిస్తున్నట్టు సీఎంవోలో చర్చ సాగుతోంది. 

ఎంపీ ఎన్నికల షెడ్యూల్ కు ముందు 37 మంది కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించినా.. కోడ్ కారణంగా నియామక ఉత్తర్వులు రాకపోవడంతో వారు బాధ్యతలు చేపట్టలేదు. కోడ్ ముగిశాక వీరి నియామకంపై జీవోలు రానున్నాయి. అయితే, తొలి లిస్ట్ లో కూడా కొన్ని పదవులు, పేర్లలో మార్పులు జరగొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. తమకు సరైన పదవులు ఇవ్వలేదని కొందరు నేతలు సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.