వారంలోగా బకాయిలు చెల్లించకపోతే.. జీవన్ రెడ్డి మాల్​ను స్వాధీనం చేస్కోండి : హైకోర్టు

వారంలోగా బకాయిలు చెల్లించకపోతే.. జీవన్ రెడ్డి మాల్​ను స్వాధీనం చేస్కోండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ ​జిల్లా ఆర్మూరు బస్టాండ్‌ దగ్గరలోని మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి మాల్​ అండ్​ మల్టీప్లెక్స్​ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. టీజీఎస్​ ఆర్టీసీకి పెండింగ్​లో ఉన్న రూ. 2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని మాల్ యాజమాన్య సంస్థ విష్ణుజిత్​ ఇన్​ఫ్రా డెవలపర్స్ ​ప్రైవేట్​ లిమిటెడ్​ను కోర్టు శనివారం ఆదేశించింది. లేదంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ ​అండ్ ​మల్టీప్లెక్స్​ భవనాన్ని టీజీఎస్​ ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. భవిష్యత్​లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే మాల్​ను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పింది.

మాల్ రీఓపెన్​కు ఓకే..

ఆ షాపింగ్​ మాల్​లోని సబ్​ లీజు దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్​ను ఓపెన్​ చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో మాల్‌ను తెరిచేందుకు ఆర్టీసీ అనుమతిచ్చింది. వారం రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే  కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.