చత్తీస్‌‌గఢ్‌‌ ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

చత్తీస్‌‌గఢ్‌‌ ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి
  •      చత్తీస్‌‌గఢ్‌‌ బీజాపూర్ జిల్లాలో ఘటన
  •      పారిపోయిన 15 మంది మావోయిస్టుల కోసం గాలిస్తున్న బలగాలు
  •      ఘటనా స్థలం నుంచి తుపాకులు, వైర్‌‌‌‌లెస్ సెట్లు, డిటోనేటర్లు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌గఢ్‌‌లోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్​పరిధిలో శనివారం జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. జప్పెంర -కల్కానార్ అడవుల్లో వెస్ట్ బస్తర్ డివిజన్ సప్లయ్‌‌ టీం ఇన్‌‌చార్జి పండ్రూ, బైరంగఢ్ ఏరియా కమిటీ కార్యదర్శి జోగా, మెంబర్​ సోనూలతో పాటు మరో 15 మంది మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో డీఆర్జీ బలగాలు కూంబింగ్‌‌ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరగగా, ఇద్దరు మృతి చెందారు. మిగతా వారు అడవిలోకి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి రెండు తుపాకులు, వైర్‌‌‌‌లెస్ సెట్లు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. 

33 మంది మావోయిస్టుల లొంగుబాటు..

బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్​ సమక్షంలో శనివారం 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఎల్‌‌జీఏ బెటాలియన్ 1, జనతన సర్కార్‌‌‌‌కు చెందిన ఆర్‌‌‌‌పీసీ అధ్యక్షులు, పూస్నార్‌‌‌‌, డమ్రీ, పాల్నార్, రుగోలీ, కర్కీ, హీరోలీ తదితర గ్రామాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. ఇందులో ముగ్గురిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు తక్షణ సాయం కింద రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 109 మంది మావోయిస్టులు లొంగిపోగా, 189 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.

 మరోవైపు, ఆదివారం చత్తీస్‌‌గఢ్ దండకారణ్యంలో బంద్‌‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఆపరేషన్‌‌ కగార్‌‌‌‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, చత్తీస్‌‌గఢ్ సీఎం విష్ణుదేవ్​సాయిలు మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ చేస్తున్న ప్రకటనలను వ్యతిరేకిస్తూ బంద్‌‌కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. కాగా, శనివారం బీజాపూర్‌‌‌‌ జిల్లా ఆవపల్లి ఊసూర్‌‌‌‌ బ్లాక్‌‌లో రోడ్లను తవ్వేశారు. బంద్‌‌కు సంబంధించి రోడ్లపై బ్యానర్లు కట్టి, కరపత్రాలను వదిలారు.