హైదరాబాద్‌లో 16 కౌంటింగ్​ కేంద్రాలు, హాల్‌లోకి మొబైల్స్ అనుమతించం: రోనాల్డ్ రోస్

హైదరాబాద్‌లో 16 కౌంటింగ్​ కేంద్రాలు, హాల్‌లోకి మొబైల్స్ అనుమతించం: రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు. కౌంటింగ్ సిబ్బంది సమర్థంగా విధులు నిర్వహించాలని సూచించారు. శనివారం బంజారా హిల్స్ లోని కుమ్రం భీమ్ భవనంలో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్​వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఏఆర్ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

సెగ్మెంట్ల వారీగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, నిబంధనలు పాటించాలని సూచించారు. ఈవీఎంలలో టెక్నికల్​ప్రాబ్లమ్​తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండిసరి చేస్తారని, ప్రతి హాల్ లో14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైనదని, రౌండ్ల వారీగా ప్రతి రిపోర్ట్ ను ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏ సమస్య ఉన్నా ఏఆర్ఓకు తెలుపాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు అని స్పష్టం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్​కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.