అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా తేజ్

అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా తేజ్
  • బంగాళాఖాతంలో మరో సైక్లోన్

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.  ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం నాటికి తుఫానుగా మారొచ్చని అంచనా వేసింది. అల్పపీడనం బలపడి తుఫానుగా ఏర్పడితే దానికి హమూన్ అని పేరు పెట్టనున్నట్లు పేర్కొంది. 

మనదేశ తీరానికి రెండువైపులా ఏకకాలంలో రెండు తుఫానుల తాకిడి ఉందని వెల్లడించింది. ఇలా రెండు తుఫానులు ఒకేసారి ఏర్పడటం గతంలో 2018లో జరిగిందని ఐఎండీ తెలిపింది. అయితే, ఈ రెండూ మనదేశంపై పెద్దగా ఎఫెక్ట్ చూపించబోవని, కొద్దిగా వాతావరణ మార్పులు కనిపించవచ్చని తెలిపింది. హమూన్ తుఫాను కారణంగా కేరళ, తమిళనాడులోని తీర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పింది.