బ్యాంకాక్ : ఆసియా రిలే చాంపియన్‌షిప్ ప్రారంభ ఎడిషన్‌లో ఇండియా మిక్స్‌డ్ 4x400 రిలే టీమ్ నేషనల్ రికార్డు బ్రేక్ చేస్తూ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కానీ, పారిస్ ఒలింపిక్స్ అర్హత మార్కు అందుకోలేకపోయింది. తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ, ముహమ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సుభా వెంకటేశన్‌తో కూడిన ఇండియా టీమ్ 3 నిమిషాల 14.12 సెకండ్లతో రేసును పూర్తి చేసి టాప్ ప్లేస్ సాధించింది.
ఈ క్రమంలో గతేడాది ఆసియా గేమ్స్‌లో 3:14.34 సె. టైమింగ్‌తో నెలకొల్పిన నేషనల్ రికార్డును బ్రేక్ చేసింది. శ్రీలంక (3:17.00సె) సిల్వర్ నెగ్గగా, వియత్నాం (3:18.45సె) బ్రాంజ్ గెలిచింది. వరల్డ్ అథ్లెటిక్స్ రోడ్ టు పారిస్ జాబితాలో ప్రస్తుతం ఇండియా 21వ స్థానంలో నిలిచింది. టాప్ 16లో నిలిచిన జట్లే పారిస్‌కు అర్హత సాధిస్తాయి.
