పాక్​ సబ్​ మెరైన్​ కోసం  21 రోజుల వేట

పాక్​ సబ్​ మెరైన్​ కోసం  21 రోజుల వేట
  • నేవీ ఆపరేషన్ పై ఆసక్తికర కథనం
  • బాలాకోట్​ ఎయిర్ స్ట్రైక్​ తర్వాత సముద్రంలోనూ టెన్షన్

న్యూఢిల్లీ: దాని పేరు పీఎన్​ఎస్​ సాద్​. పాకిస్థాన్​ అమ్ములపొదిలోని అతి భారీ సబ్​మెరైన్​. ‘హంటర్​ కిల్లర్​’గానూ వ్యవహరించే ఆ(ఎయిర్​ ఇండిపెండెంట్​ ప్రొపల్షన్​) సబ్​మెరైన్​.. మిగతా వాటికంటే ఎక్కువ సేపు నీటి అడుగుభాగంలో ఉండగలదు. కాబట్టే మనోళ్లు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. అయితే, ఫిబ్రవరిలో బాలాకోట్​పై ఎయిర్​ఫోర్స్ దాడుల తర్వాత పీఎన్​ఎస్​ సాద్​ సడన్​గా మాయమైపోయింది. అదిగానీ ఇండియావైపుకొస్తే (కరాచీ నుంచి) రెండ్రోజుల్లో గుజరాత్​ తీరాన్ని, ఐదు రోజుల్లో మహారాష్ట్ర తీరాన్ని చేరే అవకాశముండేది. పుల్వామా టెర్రర్​ అటాక్​ తర్వాత త్రివిధ దళాలూ దాదాపు యుద్ధసన్నద్ధతలో ఉన్నందున, పాక్​ అలాంటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. కానీ సాద్​ జాడ మాత్రం మనోళ్లకు మిస్టరీగా మారింది. కనిపించకుండా పోయిన పాక్​ సబ్​మెరరైన్​ కోసం మనోళ్లు తీవ్రంగా గాలించారు. న్యూక్లియర్​ సబ్​మెరైన్​ చక్ర, కొద్దిరోజుల కిందటే జలప్రవేశం చేసిన ఐఎన్​ఎస్​ కల్వరితోపాటు అందుబాటులో ఉన్న అన్ని సబ్​మెరైన్లనూ రంగంలోకి దింపారు. రోజురోజుకూ సెర్చ్​ ఏరియాను విస్తరిస్తూ పోయారు. చివరికి 21 రోజుల తర్వాత.. కరాచీకి అవతలిదిక్కుగా పీఎన్​ఎస్ సాద్​ను ఇండియన్​ నేవీ గుర్తించగలిగింది. బాలాకోట్​ దాడుల తర్వాత సముద్రంలో చోటుచేసుకున్న టెన్షన్​కు సంబంధించిన కథనం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పుల్వామా టెర్రర్​ అటాక్ తర్వాత ఇండియన్​ నేవీ సుమారు 60 యుద్ధనౌకల్ని అరేబియా సముద్రంలో మోహరింపజేయడం, ఆ వెంటనే బాలాకోట్​పై ఎయిర్​స్ట్రైక్స్​ చేయడం తెలిసిందే. మన దూకుడు చూశాక భయంతో పాక్​ తన సాద్​ సబ్​మెరైన్​ను దాచిపెట్టిఉంటుందని నేవీ అధికారులు అభిప్రాయపడ్డారు.