అరేబియా సముద్రంలో మాల్టా నౌక హైజాక్ .. సోమాలియా వైపుగాతరలుతున్న షిప్ 

అరేబియా సముద్రంలో మాల్టా నౌక హైజాక్ .. సోమాలియా వైపుగాతరలుతున్న షిప్ 
  • యుద్ధనౌకను, విమానాన్ని పంపిన ఇండియన్ నేవీ 

న్యూఢిల్లీ :  అరేబియా సముద్రంలో మాల్టా దేశానికి చెందిన కార్గో షిప్​ను సోమాలియా పైరేట్లు హైజాక్ చేశారు. ఎంవీ రుయెన్ అనే ఆ నౌకను కాపాడేందుకు ఇండియన్ నేవీ తన గస్తీ విమానాన్ని, యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధనౌకను పంపింది. ప్రస్తుతం సోమాలియా తీరం వైపుగా తరలిపోతున్న ఆ నౌకను మన యుద్ధనౌక, గస్తీ విమానం వెంటాడుతూ గమనిస్తున్నాయని నేవీ అధికారులు వెల్లడించారు.

దక్షిణ యూరప్​లోని ఐలాండ్ కంట్రీ మాల్టా కేంద్రంగా ఉన్న బల్గేరియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఎంవీ రుయెన్ నౌక గురువారం హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం మధ్య యెమెన్ తీరానికి సమీపంలో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద హైజాక్​కు గురైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) పోర్టల్ అలర్ట్ చేసింది. నౌకలోని సిబ్బంది నుంచి తమకు మేడే కాల్(ఆపదలో ఉన్నాం కాపాడండి అనే మెసేజ్) అందినట్లు తెలిపింది.

‘‘హైజాక్ అయిన షిప్​లో అంగోలా, బల్గేరియా, మయన్మార్​కు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నారు. గురువారం నౌకలోకి ఆరుగురు పైరేట్లు చొరబడ్డారు. నౌకపై సిబ్బంది కంట్రోల్ కోల్పోయారు. ప్రస్తుతం ఆ నౌక సోమాలియాలోని పంట్ లాండ్ వైపుగా ప్రయాణిస్తోంది” అని ఆ పోర్టల్ వివరించింది. యూకేఎంటీవో పోర్టల్ నుంచి అలర్ట్ మెసేజ్ అందిన వెంటనే ఇండియన్ నేవీ యుద్ధనౌకను, గస్తీ విమానాన్ని పంపిందని నేవీ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఎంవీ రుయెన్ వద్దకు చేరుకున్న ఎయిర్ క్రాఫ్ట్ దానిని వెంటాడుతూ పరిస్థితిని గమనిస్తోందని చెప్పారు. హైజాక్ అయిన షిప్​ను నిరంతరం గమనిస్తున్నామని వివరించారు. కాగా, అంతర్జాతీయ జలాల్లో గస్తీని పటిష్టం చేయడంతో కొన్నేండ్లుగా సోమాలియా పైరేట్ల యాక్టివిటీలు తగ్గిపోయాయి. ఇటీవలికాలంలో ఇంత పెద్ద షిప్​ను హైజాక్ చేయటం ఇదే మొదటిసారని చెప్తున్నారు.