20 రూపాయలకే భోజనం..రూ.50కే స్నాక్స్

20 రూపాయలకే భోజనం..రూ.50కే స్నాక్స్
  • రైల్వే స్టేషన్లలోఎకానమీ మీల్స్
  • 12 స్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా అందుబాటులోకి

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రైల్వే, ఐఆర్​సీటీసీ కలిసి రైల్వే ప్రయాణికుల కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ‘‘ఎకానమీ మీల్స్’’ పేరుతో మంగళవారం నుంచే అందిస్తున్నామని వివరించారు. వేసవిలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా జనరల్ కోచ్​లోని ప్యాసింజర్ల కోసం రెండు రకాల భోజనం ఇస్తున్నామని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్​రైల్వే స్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా ఎకానమీ మీల్స్ అందిస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా 100 స్టేషన్లలో 150 కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు.

పోయిన ఏడాదే

జనరల్ బోగీల్లోని ప్రయాణికుల కోసం ఎకానమీ భోజనం, స్నాక్స్ అందుబాటులో ఉంచారు. 20 రూపాయలకే భోజనం, 50 రూపాయలకు స్నాక్స్ అందజేశారు. ప్లాట్​ఫామ్​లపై జనరల్ కోచ్​లు ఆగిన చోటే కౌంటర్లు ఏర్పాటు చేశారు. పోయిన ఏడాదే ఈ సేవలను 51 స్టేషన్లలో ఇండియన్ రైల్వే ప్రారంభించింది. ఇప్పుడు వంద స్టేషన్లకు పెంచించింది. భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లలో ఎకానమీ మీల్స్ అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.