
పండుగ సీజన్ కారణంగా రైల్వే స్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక కొత్త ఫెసిలిటీ ప్రారంభించింది. ప్రతిరోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న ఈ సమయంలో రిజర్వ్ చేయని టికెట్లు అంటే జనరల్ బోగి(unreserved tickets)లో ప్రయాణించే వారి కోసం QR కోడ్ స్కానర్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ QR కోడ్ స్కానర్‌ల ద్వారా ఈజీగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
UTS మొబైల్ యాప్: ఇప్పుడు రైలు ప్రయాణికులు ఈజీగా టికెట్లు కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 'UTS' మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్లు కొనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. UTS యాప్ అనేది రైల్వే ప్రయాణికులకు ఒక వరం లాంటిది అని చెప్పొచ్చు, ఎందుకంటే రిజర్వ్ చేయని టికెట్ల కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన పని లేదు. ఈ యాప్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియజేయడానికి రైల్వే అధికారులు ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని ఫాలో అవుతున్నారు.
QR కోడ్‌లు ఎలా పని చేస్తాయంటే : పండుగ సీజన్లో రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుండటంతో ప్రముఖ స్టేషన్లలో UTS యాప్ ద్వారా టికెట్లు కొనేలా ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు రైల్వే సిబ్బంది ధరించే రెడ్ కలర్ జాకెట్లపై QR కోడ్ స్టిక్కర్లు ముద్రించి ఉంటాయి. మీరు వాటిని UTS మొబైల్ యాప్/Rail One యాప్ తో స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. స్టేషన్లలో రద్దీగా ఉండే ప్రాంతాలు, ఎంట్రీ/ఎగ్జిట్ గేట్లు, టికెట్ కౌంటర్ల వద్ద ఈ జాకెట్లను ధరించిన సిబ్బంది ఉంటారు.
ఇలా చేయడం వల్ల టికెట్ కౌంటర్ల వద్ద ఉండే క్యూ లైన్లో నిలబడాల్సిన పని లేదు, అలాగే ప్రయాణికులకి టికెట్ బుకింగ్ మరింత ఈజీ అవుతుంది. ఇంకా చేతిలో డబ్బు లేకున్నా డిజిటల్‌గా టికెట్లు కొనొచ్చు. ఈ సదుపాయం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్, తిరుపతి, నాందేడ్ వంటి ఆరు ప్రముఖ డివిజన్లలోని స్టేషన్లలో ప్రారంభించారు.
అంతేకాకుండా, రైల్వే ట్రాక్ నుండి కనీసం 5 మీటర్ల దూరంలో ఉన్న ఎక్కడినుంచైనా ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంటే, మీరు ఇంటి దగ్గర నుంచే మీ ప్రయాణానికి సంబంధించిన టికెట్లు (జనరల్/ప్లాట్‌ఫామ్ టికెట్లు) బుక్ చేసుకుని రైలు ఎక్కొచ్చు. దీని ద్వారా స్టేషన్లో టికెట్ కోసం క్యూలో నిలబడే పని ఉండదు.
ఈ UTS యాప్ వివిధ బాషల్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే పూర్తిగా పేపర్ లెస్ కూడా. టికెట్ చార్జెస్ R-Wallet, Paytm, UPI, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. R-Wallet ఉపయోగించి టికెట్లు కొంటే టికెట్ ధరపై 3 శాతం బోనస్ కూడా లభిస్తుంది.