V6 News

రూపాయి కొత్త రికార్డు పతనం: ఒక్క డాలర్‌ రూ.90.56.. వాణిజ్య ఒప్పందం కుదరకపోవటమే కారణమా?

రూపాయి కొత్త రికార్డు పతనం: ఒక్క డాలర్‌ రూ.90.56.. వాణిజ్య ఒప్పందం కుదరకపోవటమే కారణమా?

భారత రూపాయి విలువ డిసెంబర్ 12న అమెరికన్ డాలర్‌తో పోలిస్తే సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం, డాలర్ బలపడటం, భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం వంటి అంశాలు రూపాయిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేడు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90.56కు పడింది. ఇది డిసెంబర్ 11న నమోదైన 90.4675 రికార్డు కనిష్టాన్ని అధిగమించటం గమనార్హం. దీనిని అరికట్టడానికి రిజర్వు బ్యాంక్ ప్రయత్నాలు వేగవంతం చేసినప్పటికీ పరిస్థితి మాత్రం దిగజారుతూనే ఉందనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి. 

రూపాయి పతనానికి ప్రధాన కారణాలు..

* ఫైనల్ కాని ట్రేడ్ డీల్: అమెరికాతో భారతదేశం వాణిజ్య ఒప్పందం ఫైనల్ కాకపోవటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
* బలంగా డాలర్: డాలర్ సూచీ(Dollar Index) 0.02 శాతం పెరిగి 98.37 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది రూపాయికి ప్రతికూలంగా మారింది.
* విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(FPIs) భారత మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటూ తరలిపోతుండటం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచింది.
* దిగుమతిదారుల డిమాండ్: విలువైన లోహాల అంతర్జాతీయ ధరలు పెరగడంతో.. చెల్లింపుల కోసం దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేయడం కూడా రూపాయి విలువను మరింత తగ్గించింది.

ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీగా రూపాయి..

రూపాయి ఈ సంవత్సరం ఆసియాలోనే అత్యంత వీకెస్ట్ కరెన్సీగా నిలిచింది. ఏడాది ఆరంభం నుంచి డాలర్‌తో పోలిస్తే దాదాపు 6% విలువ కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం.. భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50% టారిఫ్స్. ఈ సుంకాల కారణంగా అమెరికాకు భారతీయ ఎగుమతులు దెబ్బతినడమే కాక.. విదేశీ పెట్టుబడిదారులకు భారతీయ ఈక్విటీల ఆకర్షణ కూడా తగ్గింది. పైగా డాలర్లకు పెరుగుతున్న డిమాండ్ పతనాన్ని మరింత ప్రేరేపిస్తోంది.

►ALSO READ | పౌల్ట్రీ అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ సమిట్ కీలకం: ఉదయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ బయాస్‌‌‌‌

ఈ తరుణంలో అమెరికా తన సుంకాలను కొనసాగిస్తే లేదా ఇంకా పెంచితే రూపాయి మరింతగా బలహీనపడే అవకాశం ఉందని ANZ ఆర్థికవేత్త ధీరజ్ నిమ్ వెల్లడించారు. సుంకాలతో ఎగుమతులు తగ్గటంతో డాలర్ల రాబడి ఇండియాకు తగ్గిందని.. ఇదే సమయంలో దిగుమతుల చెల్లింపులకు మాత్రం డాలర్ అవసరం కొనసాగుతుండటంతో డాలర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు యూఎస్ ప్రతినిధులతో సమావేశం తర్వాత ఏదైనా డీల్ ప్రకటన ఉంటుందని మార్కెట్లు కూడా ఎదురుచూస్తున్నాయి. ఈ రోజు రూపాయి 90 నుండి 90.60 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ LLP ప్రతినిధి అనిల్ కుమార్ భన్సాలీ అభిప్రాయపడ్డారు.