విజయవంతంగా చంద్రయాన్‌-3 కక్ష్య పెంపు..!

విజయవంతంగా చంద్రయాన్‌-3 కక్ష్య పెంపు..!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండుసార్లు కక్ష్యను నౌక విజయవంతంగా పెంచగా.. మంగళవారం (జులై 18న) మూడోసారి కక్ష్యను (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మ్యాన్యువర్) పెంచినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరు నుంచి ఈ విన్యాసాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. ప్రస్తుతం చంద్రయాన్-3 భూమికి 41,603 కిమీ x 226 కిమీ దూరంలో ఉన్న భూ కక్ష్యలో ఉందని ఇస్రో వివరించింది.

జులై 20న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో మరోసారి ఇంజిన్‌ను బర్న్‌ చేసి కక్ష్యను పెంచనున్నట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్‌ నౌక భూమి చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రతి కక్ష్యతో శాటిలైట్‌ దూరాన్ని పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. చంద్రయాన్-3 భూమికి దగ్గరగా ఉండగా.. చంద్రుడు వైపునకు వెళ్లడానికి ఇంజిన్‌లను మళ్లీ బర్న్ చేసి వరుసగా ఆటిట్యూడ్‌ను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. చంద్రయాన్‌- 3 స్పేస్‌క్రాఫ్ట్ ఆగస్టు 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇస్రో జులై 14న చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగాప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడిపైకి ఇస్రో పంపిన మూడో మిషన్‌ ఇది. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ విజయవంతమైతే.. భారత్ విజయం సాధిస్తే ప్రపంచంలోనే నాలుగో దేశంగా అవతరించనున్నది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి.