గ్రీన్‌లాండ్‌పై అమెరికా జెండా: స్టాక్ మార్కెట్ ఢమాల్.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి..

గ్రీన్‌లాండ్‌పై అమెరికా జెండా: స్టాక్ మార్కెట్ ఢమాల్.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి..

భారత స్టాక్ మార్కెట్లు తమ వరుస నష్టాలను మంగళవారం కూడా కొనసాగిస్తున్నాయి. 2026, జనవరి 20వ తేదీన ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లోనే ఉన్న కీలక సూచీలు చివరికి ఊహించని భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సాయంత్రం మార్కెట్ల ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1065 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 353 పాయింట్లు లాస్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 487 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1562 పాయింట్ల భారీ పతనాన్ని చూశాయి. దీంతో నిఫ్టీ సూచీ ఏకంగా తన 3 నెలల కనిష్టాలకు దిగజారింది. 

ALSO READ : 91 మార్కు దాటిన రూపాయి: విలువ పతనానికి కారణాలు ఇవే..

దీంతో ఈ ఒక్కరోజునే భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ఉదయం నుంచి రెడ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్.. క్లోజింగ్ లో మరింత పడిపోయాయి. గ్రీన్ ల్యాండ్స్, వెనిజువెలా, కెనడా దేశాలు మావే అంటూ.. ఆయా దేశాల మ్యాపులపై అమెరికా జెండా ఎగరేస్తున్నట్లు ట్రంప్ విడుదల చేసిన ఫొటో.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దీంతో పెట్టుబడిదారులు లబోదిబో అన్నారు. ఇదే క్రమంలో మార్కెట్ల పతనానికి దారితీసిన మరిన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ట్రంప్ టారిఫ్ భయాలు: 
అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య గ్రీన్ లాండ్ విషయంలో తలెత్తిన విభేదాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. నాటో (NATO) మిత్రదేశాలపై ట్రంప్ కొత్తగా సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీనికి తోడు ట్రంప్ కాలం నాటి టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు కోసం ఇన్వెస్టర్లు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ భయాల కారణంగా అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ 1 శాతం మేర పతనమవగా.. ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

విదేశీ పెట్టుబడిదారుల వరుస అమ్మకాలు: 
భారత మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకోవడం నిరంతరాయంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే వీరు రూ.3వేల 262 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో వరుసగా 10వ సెషన్‌లో కూడా అమ్మకాలు కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనివల్ల రూపాయి విలువ కూడా బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 91 మార్కుకు చేరువలో ఉంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది.

నిరాశాజనకంగా క్యూ3 ఫలితాలు: 
మూడవ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా మార్కెట్ పతనానికి మరో కారణం. ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్తు ఆదాయాలపై బలహీనమైన అంచనాలను ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. ఫలితంగా ఐటీ ఇండెక్స్ 1.1 శాతం నష్టపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు 3 శాతం వరకు క్షీణించాయి.

పెరుగుతున్న క్రూడ్ ధరలు:  
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరగడం భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపుమార్కెట్ భయాందోళనలను సూచించే 'ఇండియా విక్స్' 4 శాతం పెరిగి 12.34 వద్దకు చేరడం ఇన్వెస్టర్లలో కొనసాగుతున్న భయాలకు అద్దం పడుతోంది. దీనికి తోడు ఇవాళ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కారణంగా కూడా ట్రేడింగ్‌లో భారీ ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి.