ఇండియన్ స్టాక్ మార్కెట్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. లాభాల్లో కాదు.. నష్టాల్లో. ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్ లోని సామాన్యుల అకౌంట్లలో డబ్బులు ఆవిరి అవుతున్నారు. ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లు భారీగా నష్టపోతుండటంతో.. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారులకు కన్నీళ్లే.. నిన్నటికి నిన్న 10 లక్షల కోట్లు ఆవిరి అయితే.. 2026, జనవరి 21వ తేదీ సైతం అదే రేంజ్ లో స్టాక్ మార్కెట్ పతనం.. భారీ నష్టాలతో సంపద మొత్తాన్ని తుడిచిపెట్టేస్తోంది.
భారత స్టాక్ మార్కెట్లు తమ నష్టాల పరంపరను వరుసగా కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో ఉదయం 11 గంటల సమయంలో జనవరి 21న బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 800 ప్లస్ పాయింట్ల లాస్ లో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 240 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 880 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1150కి పైగా పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి.
ఇవాళ ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ ఏకంగా 1000 పాయింట్లు క్రాష్ కావటంతో ఈ నష్టాలు ఇంకెంత కాలం ఉంటాయనే భయంలో ఇన్వెస్టర్లు గజగజలాడుతున్నారు. అక్టోబర్ 6, 2025 తర్వాత సెన్సెక్స్ సూచీ ఒక్కరోజే 920 పాయింట్లు కోల్పోవటం ఇదే మెుదటిసారి కావటం గమనార్హం. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయి. అయితే ఇవాళ మార్కెట్లను భారీ నష్టాల దిశగా నడిపించిన కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
1. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి:
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 31 పైసలు క్షీణించి 91.28 వద్ద ఆల్‌టైమ్ దిగువకు పడిపోయింది. విదేశీ మూలధనం బయటకు వెళ్లిపోతుండటం, డాలర్‌కు పెరిగిన డిమాండ్ దీనికి ప్రధాన కారణాలు.
2. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు:
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) జనవరిలో వరుసగా 11వ సెషన్‌లోనూ అమ్మకాలు కొనసాగించారు. తాజాగా మంగళవారం ఒక్కరోజే రూ.2వేల 938 కోట్ల 33 లక్షలు విలువైన షేర్లను విక్రయించారు.
3. అంతర్జాతీయ సంక్షోభం:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌పై చేసిన వ్యాఖ్యలు, ఐరోపా దేశాలపై టారిఫ్ ఆంక్షల హెచ్చరికలతో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాలోని నాస్‌డాక్ 2.39%, ఎస్‌అండ్‌పీ 2.06% పడిపోయాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా నేడు తీవ్రంగా పడింది.
4. పెరిగిన ఇండియా విక్స్:
మార్కెట్ ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ 4 శాతం పెరిగి 13.22 వద్దకు చేరింది. ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన అనిశ్చితిని, రిస్క్ భయాన్ని తెలియజేస్తోంది.
5. కుదేలైన బ్యాంకింగ్ షేర్లు:
మార్కెట్ పతనంలో బ్యాంకింగ్ రంగానికి చెందిన హెవీ వెయిట్ షేర్లు కీలక పాత్ర పోషించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ కూడా 1 శాతం పైగా పడిపోయింది.
మొత్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్లను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లేలా చేస్తున్నాయి.
