
ముంబై: అమ్మకాల ఒత్తిడితో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ 849 పాయింట్లు కోల్పోయి 81 వేల మార్క్‌కు దిగువన ముగిసింది. నిఫ్టీ కూడా 255 పాయింట్లు నష్టపోయింది. భారతీయ ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకం విధించనున్నట్లు అమెరికా డ్రాఫ్ట్ నోటీసు జారీ చేయడం ఈ పతనానికి ప్రధాన కారణం. సెన్సెక్స్‌లో మొత్తం 25 షేర్లు నష్టాల్లో ముగియగా, కేవలం ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సన్ ఫార్మా , టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ వంటివి భారీగా నష్టపోయాయి.
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మారుతి సుజుకి ఇండియా లాభపడ్డాయి. మారుతి సుజుకి ఈ-–విటారా ఎగుమతులను ప్రారంభించడం వల్ల 1.85 శాతం లాభంతో ముగిసింది. రియల్టీ, మెటల్, టెలికమ్యూనికేషన్, ఎనర్జీ రంగాల సూచీలు భారీగా నష్టపోయాయి. వినియోగం పెరుగుతుందనే అంచనాలతో ఎఫ్‌ఎంసీజీ రంగం మాత్రమే లాభాల్లో ఉంది. మార్కెట్లలో నష్టపోయిన స్టాక్స్ సంఖ్య 2,891 కాగా, లాభపడిన స్టాక్స్ సంఖ్య 1,220.
మార్కెట్లపై ప్రభావం చూపిన అంశాలు
అమెరికా సుంకాలు: భారతీయ ఉత్పత్తులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించడంతో ఎగుమతి ఆధారిత రంగాలైన మెటల్, రియల్టీ, ఫార్మా వంటి వాటిలో భారీ అమ్మకాలు జరిగాయి. ఈ సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి నిధులను భారీగా వెనక్కి తీసుకోవడం కూడా పతనానికి ఒక కారణం. సోమవారం ఒక్కరోజే వీరు రూ. 2,466.24 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.
ప్రపంచ మార్కెట్ల ప్రభావం: ఆసియా, యూరోప్, యూఎస్ మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడంతో దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
ఫార్మా షేర్లపై ఒత్తిడి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మందుల ధరలు తగ్గించాలని సూచించిన వార్తల వల్ల సన్ ఫార్మాస్యూటికల్ షేర్ 3.40 శాతం నష్టపోయింది.
బలహీనమైన రూపాయి: రూపాయి విలువ తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.