V6 News

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ ప్రకటనతో రైస్ స్టాక్స్ ఢమాల్..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ట్రంప్ ప్రకటనతో రైస్ స్టాక్స్ ఢమాల్..

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజు కూడా తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. నిన్న మార్కెట్ల పతనం కారణంగా దాదాపు ఇన్వెస్టర్ల సంపద 7 లక్షల కోట్ల మేర ఆవిరైన సంగతి తెలిసిందే. అయితే అదే బేర్ దూకుడు ఇవాళ సైతం మార్కెట్లలో కనిపిస్తున్నాయి. ఉదయం 10.55 గంటల సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 150 పాయింట్లకు పైగా లాస్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 110 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 340 పాయింట్లు పతనమైంది. 

ప్రధానంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ పతనంలో కొనసాగుతున్నాయి. దీనికి తోడు నేడు జరగనున్న ఫెడ్ మానిటరీ పాలసీపై అందరి దృష్టి కొనసాగుతోంది. ఈసారి పావెల్ వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా అనే ఆందోళనల మధ్య ముందస్తుగానే ప్రాఫిట్ బుక్కింగ్ కి నిన్నటి నుంచి వెళ్లారు. విదేశీ పెట్టుబడిదారులు సైతం డాలర్ దూకుడుతో ఇతర మార్కెట్లలోకి డబ్బు పెట్టుబడి పెట్టేందుకు బలహీనమైన రూపాయి వల్ల ఇండియన్ ఈక్విటీలను వదిలి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. 

ట్రంప్ ప్రకటనతో రైస్ స్టాక్స్ ఫాల్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారతదేశంపై మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇండియా తమ దేశంలో బియ్యం డంప్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. దీంతో ఎల్టి ఫుడ్స్, జీఆర్ఎమ్ ఓవర్సీస్, కేఆర్బీఎల్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ వంటి బియ్యం ఎగుమతి చేసే కంపెనీల షేర్లు అత్యధికంగా 8 శాతం వరకు నష్టాలను నమోదు చేశాయి ఇంట్రాడేలో. ప్రస్తుతం ట్రంప్ అమెరికా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత బియ్యం, కెనడా ఫెర్టిలైజర్లపై కొత్త టారిఫ్స్ ప్రకటించనున్నట్లు చెప్పటం ఆందోళనలకు కారణంగా మారింది.