V6 News

భారత్‌పై ట్రంప్ భారీ సుంకాలకు రష్యన్ ఆయిల్ కారణం కాదు.. నిజం చెప్పిన రఘురామ్ రాజన్

భారత్‌పై ట్రంప్ భారీ సుంకాలకు రష్యన్ ఆయిల్ కారణం కాదు.. నిజం చెప్పిన రఘురామ్ రాజన్

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాల వెనుక ఉన్న అసలు కారణం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కాదని, ఇది కేవలం 'వ్యక్తిగత వైరం' మాత్రమేనంటూ RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే దౌత్యపరమైన విభేదమే కారణం అన్నారు రాజన్. ఈ విషయంలో నిజంగా ట్రంప్ వెనుక నిలిచి పాక్ ప్రయోజనం పొందిందని చెప్పారు. 

రష్యా చమురు కొనుగోళ్లు ఎప్పుడూ అమెరికాకు ప్రధాన సమస్య కాదని చెబుతూ.. నిన్న హంగేరీలో విక్టర్ ఓర్బన్ రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ మినహాయింపు ఇవ్వటాన్ని దానికి ఉదాహరణగా చెప్పారు రాజన్. భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణను ఆపినందుకు ట్రంప్ క్రెడిట్ తీసుకున్న తర్వాత భారతదేశ వైఖరిపై వైట్‌హౌస్ స్పందించిన తీరే అసలు వివాదానికి కారణంగా రాజన్ వివరించారు. యుద్ధం ఆగటానికి ట్రంప్ కారణం కాదంటూ ఇండియా చేసిన ప్రకటన వైట్‌హౌస్ నేతకు మింగుడుపడలేదని దాని నుంచి పుట్టిన వ్యక్తిగత వైరమే భారీ సుంకాలకు కారణమైందని చెప్పారు రాజన్.

ఆపరేషన్ సిందూర్ వివాద సమయంలో పాకిస్థాన్, సంక్షోభాన్ని ఆపినందుకు ట్రంప్‌కు బహిరంగంగా క్రెడిట్ ఇచ్చింది. అయితే కాల్పుల విరమణ అనేది ఇరు దేశాల సైనిక నాయకుల మధ్య ప్రత్యక్ష సంభాషణ ద్వారానే జరిగిందని భారత్ పేర్కొంది. అప్పటి నుంచే అసలు గేమ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయంలో పాకిస్థాన్ సరైన విధంగా ఆడిన ఫలితంగా 19 శాతం సుంకాలను పొందగా.. విభేదించిన భారత్ మాత్రం 50 శాతం సుంకాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రఘురామ్ రాజన్ వాస్తవాన్ని బయటపెట్టారు. ఇదంతా పూర్తిగా ట్రంప్ ఇగోకు సంబంధించిన విషయంగా ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. 

ఎవ్వరు ఏమనుకున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇప్పటికీ పదేపదే తానే వ్యక్తిగతంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన "అణు" యుద్ధాన్ని ఆపినట్లు పలు సందర్భాల్లో చెప్పుకుంటూనే ఉన్నారు. మియామిలోని అమెరికా బిజినెస్ ఫోరంలో ఆయన ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు: "ఏడు విమానాలు కూల్చివేయబడ్డాయి, ఎనిమిదోది నిజంగా తీవ్రంగా దెబ్బతిందని కూడా కామెంట్ చేశారు ఇటీవల. తానొక శాంతి ధూతనని, అనేక యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంటూ పట్టుపట్టిన సంగతి కూడా తెలిసిందే ట్రంప్ విషయంలో.