భారత టెస్టు ప్రయాణానికి 90 ఏళ్లు

భారత టెస్టు ప్రయాణానికి 90 ఏళ్లు

క్రికెట్లో ఏ ఫార్మాట్ అయినా..టెస్టు అనేది ఎప్పటికీ ప్రత్యేకమే. వన్డేలు, కొత్తగా వచ్చిన టీ20లు ఆడితే అప్పటికప్పుడు కిక్కు వస్తుందేమో కానీ..అసలైన కిక్ మాత్రం టెస్టు క్రికెట్లోనే ఉంది.  ఒక ప్లేయర్ సత్తా తెలియాలంటే  టెస్టుల్లోనే. ఒక్కరోజులో ఆడే క్రికెటర్కు ఐదు రోజులు ఆడే క్రికెటర్కు ఎంతో తేడా ఉంటుంది.  ఐదు రోజుల పాటు మైదానంలో క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదు. ఎంతో కఠోర దీక్ష, ఎంతో ఓపిక, శ్రమ, ఆడాలన్న తపన ఉంటేకానీ అది సాధ్యం కాదు. అందుకే సంప్రదాయ క్రికెట్ ఎప్పటికీ   గొప్ప ఫార్మాట్. అలాంటి గొప్ప ఫార్మాట్ను  భారత జట్టు సరిగ్గా ఇదే రోజు ప్రారంభించింది. అంటే 1932  జూన్ 25న భారత్.. తన టెస్టు కెరియర్ను మొదలుపెట్టి..నేటికి 90 ఏళ్లు గడిచింది.    

సరిగ్గా ఇదే రోజున..
1932 జూన్ 25 భారత్ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది.  అప్పటికే టెస్టుల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు దూసుకుపోతున్నాయి.  దీంతో భారత్  టెస్టు హోదా సాధించిన 6వ దేశంగా నిలిచింది. 1928లో భారత్ లో క్రికెట్ వ్యవహారాలను నియంత్రించడానికి క్రికెట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు తరపున  క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో  టీమిండియా ఇంగ్లాండ్తో  అధికారిక టెస్ట్ ఆడింది.  భారత్తో టెస్టు ఆడేందుకు ఇంగ్లాండ్ బోర్డు ఒప్పుకున్నా..ఆ టూర్కు అయ్యే ఖర్చులు భరించేందుకు బోర్డు దగ్గర డబ్బుల్లేవు. దీంతో బోర్డు పలువురు సంస్థానాధీశులు అందించాలని కోరింది. అయితే జట్టుకు కెప్టెన్గా పాటియాలా మహారాజు, వైస్ కెప్టెన్గా సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన లింబ్డి రాజు, డిప్యూటీ వైస్ కెప్టెన్ గా విజయనగరం మహారాజుని, జట్టు సభ్యుడిగా పోర్ బందర్ మహారాజుని తీసుకుంటేనే టీమ్  ఖర్చులు భరిస్తామని షరతు పెట్టడంతో..వాళ్ళను తీసుకున్నారు.   అయితే తమ ప్రదర్శనల పట్ల సంతృప్తిగా లేని  పాటియాలా మహారాజుతో పాటు  మిగిలిన ముగ్గురు ఈ టూర్ నుంచి తప్పుకున్నారు.  దీంతో టీమ్ కెప్టెన్గా మన తెలుగు వాడు కల్నల్ కొఠారి కనకయ్య నాయుడు ఎంపికయ్యాడు. అయితే అంతకుముందే సీకే నాయుడు సన్నాహక మ్యాచ్ లో సెంచరీతో రెచ్చిపోయాడు. అప్పుడు ఇంగ్లాండు  న్యూస్ పేపర్స్ ఆయన్ను  ఇండియన్ బ్రాడ్ మన్గా అభివర్ణించాయి. దీంతో భారత క్రికెట్ బోర్డు ఆయనకు జట్టు పగ్గాలు అప్పగించింది. 


 
అరంభంలో అదుర్స్..
మొదటి టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన  ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టీమిండియా బౌలర్లు అమర్ సింగ్, మహమ్మద్ నిస్సార్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ కేవలం 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ జార్డిన్, వాలీ హామండ్, జార్జీ ఏమ్స్ జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా జార్డిన్, జార్జీ ఏమ్స్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో..   ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ భారత జట్టు వికెట్ నష్టపోకుండా 30  పరుగులు చేసి మొదటి రోజు ఆట ముగించింది.  ఇదే ఊపును రెండో కొనసాగించేందుకు భారత జట్టు ప్రయత్నించింది. ఓ దశలో వికెట్ నష్టానికి 110 పరుగులతో ఉంది.  కెప్టెన్ సి. కె. నాయుడు, నజీర్ ఆలీలకు తప్ప మిగతా వారికి అనుభవం లేదు. దీంతో భారత టపా టపా వికెట్లను కోల్పోయింది. 4 వికెట్లకు  160 రన్స్ చేసి  పటిష్ట స్థితిలో ఉందనుకున్న సమయంలో..ఒక్కసారిగా 29 పరుగుల వ్యవధిలో మిగతా 6 వికెట్లు నష్టపోయి..189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సి. కె. నాయుడు 40 పరుగులు సాధించాడు. సెకండ్  ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 275 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 345 పరుగుల టార్గెట్ను ఉంచింది.

లక్ష్యం పెద్దదైనా...
345 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా...187పరుగులకు ఆలౌట్ అయి..158 పరుగుల తేడాతో ఓడిపోయింది. అమర్ సింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే  మ్యాచ్ ఓడిపోయినా టెస్టు ఆడగల సత్తా లేదని విమర్శించిన వారికి సీకే నాయుడు టీమ్ గట్టిగానే సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఎన్నో టెస్టులు ఆడినా..భారత్ మొదటి టెస్టు విజయం 1952లో దక్కింది.  1952లో ఇంగ్లాండ్ పై  ఫస్ట్ టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఏడాదే..పాకిస్తాన్ పై  మొదటి టెస్టు సిరీస్ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. 

ఇప్పటి వరకు ఎన్ని టెస్టు ఆడింది..
1932 నుంచి 2022 వరకు చూసుకుంటే భారత జట్టు..ఈ 90 ఏళ్లలో 562 టెస్టులు ఆడింది. ఇందులో 168 మ్యాచుల్లో విజయం సాధించగా...173 టెస్టుల్లో ఓడింది. 220 టెస్టులను డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్ మాత్రమే టైగా ముగిసింది. 

టెస్టును మనకు ఎవరు పరిచయం చేశారు..
ఆంగ్లేయులు భారతదేశానికి క్రికెట్ను పరిచయం చేశారు. 1721లో ఇండియాలో మొదటి  టెస్టు మ్యాచ్ జరిగింది.  మన దేశంలో టెస్టులు ఆడిన మొదటి భారతీయులు పార్సీలు. 1846లో ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ద్వారా వారు  క్రికెట్ ఆడారు.  ఆ తర్వాత అది పార్శీ క్రికెట్ క్లబ్గా మారింది. ఈ క్లబ్ తరఫున పార్శీ టీమ్..1846లో ఇంగ్లాండు పర్యటనకు వెళ్ళింది. కొన్ని కౌంటీ జట్లు, క్లబ్ జట్లతో 28 మ్యాచులాడింది. ఇందులో  19 ఓడిపోయి, 8 డ్రా చేసి, ఒకటి గెలిచింది. పార్సీలు, ఆంగ్లేయులు ఆడుతున్న మ్యాచ్లలో, హిందూ జింఖానా జట్టు లిసి బాంబే ట్రయాంగులర్ పేరుతో వార్షిక టోర్నీ నిర్వహించింది.  వీరితో ముస్లిం టీమ్ కలిసింది. దీని తర్వాత ఇది బాంబే క్వాడ్రాంగులర్ పేరిట కొంతకాలం కొనసాగింది.  యూదులు, బౌద్ధులు, భారతీయ క్రైస్తవులతో కూడిన అయిదవ జట్టు కలిశాక బాంబే పెంటాగ్యులర్ అయింది. మత ప్రాతిపదికన జరుగుతున్నాయని.. ఈ పోటీలను 1946లో రద్దు చేశారు.  అయితే పార్శీల జట్టు  ఇంగ్లాండ్ టూర్ తర్వాత మరో రెండు భారత జట్లు 1888,1911లలో  అనధికారికంగా ఇంగ్లాండ్ లో పర్యటించాయి. ఈ రెండు పర్యటనలకు పాటియాలా మహారాజు భూపిందర్ సింగ్ ఖర్చులను భరించారు.