ఇండియాలో రూ.45 లక్షల శాలరీ ప్యాకేజీ వస్తోంది. అయినా జర్మనీ నుంచి రూ. 73 లక్షలు జాబ్ ఆఫర్ వచ్చింది. ఒకవైపు ప్రస్తుత కంపెనీలో ఉద్యోగ భద్రత లేకపోవడం.. మరోవైపు విదేశాల్లో కెరీర్‌ను విస్తరించుకునే అవకాశం ఒక టెక్కీని తీవ్రమైన డైలమాలో పడేసింది. రూపాయి సంపాదన పరంగా చూస్తే విదేశీ ఆఫర్ ఆకర్షణీయంగానే ఉన్నప్పటికీ.. అక్కడి ఖర్చులు, పన్నులు లెక్కేస్తే అసలు గందరగోళం బయటపడుతుంది. తన భవిష్యత్తు కోసం ఏ దారి ఎంచుకోవాలో తెలియక సదరు టెక్కీ మదనపడటం ఇప్పుడు టెక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రెడిట్‌లో తనకు వచ్చిన విదేశీ జాబ్ ఆఫర్‌పై సలహా కోరిన ఆ టెక్కీ తన ప్రస్తుత పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించాడు. ప్రస్తుతం భారత్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వల్ల ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయట. అయితే తాను పనిచేస్తున్న కంపెనీలో జరుగుతున్న రీస్ట్రక్చరింగ్ కారణంగా ఎప్పుడైనా లేఆఫ్స్ జరిగే అవకాశం ఉండటంతో.. సంస్థ ఇచ్చే సెవెరెన్స్ ప్యాకేజీ కోసం కొద్ది రోజులు వేచి చూడాలని భావిస్తున్నాడు. ఈ తరుణంలో జర్మనీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వీసా స్పాన్సర్‌షిప్‌తో 70వేల యూరోల వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందట. అయితే ఇందులో రీలోకేషన్ సాయం, వేరియబుల్ పే, ఈసాప్స్ వంటివి లేకపోవడం గమనార్హం.
పేపర్ మీద కనిపించే 73 లక్షల రూపాయలు అక్కడి నిజమైన పొదుపును సూచించవని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. జర్మనీలో సంపాదనపై దాదాపు 40 శాతానికి పైగా ట్యాక్స్‌లు కట్టాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, ట్రాన్స్ పోర్ట్.. రోజువారీ ఖర్చులు భారత్‌తో పోలిస్తే చాలా ఎక్కువే. భారత్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సంపాదించి దాచే మొత్తంతో పోలిస్తే.. జర్మనీలో భారీగా ఖర్చులు పోను చేతిలో మిగిలేది చాలా తక్కువేనని అక్కడ ఉంటున్న ఇండియన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా బెర్లిన్ లేదా మ్యూనిచ్ వంటి ఖరీదైన నగరాల్లో అద్దెలు భరించడం ఆశామాషీ కాదని స్పష్టం చేస్తున్నారు.
అయితే కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా గ్లోబల్ ఎక్స్పోజర్, సరికొత్త సంస్కృతిని అనుభవించడం, వ్యక్తిగత వృద్ధి వంటి అంశాల దృష్ట్యా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని మరికొందరు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నట్లయితే ఈ విదేశీ ప్రయాణం జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పుతుందని.. యూరప్‌లో ఇతర ఉన్నత ఉద్యోగ అవకాశాలకు ఇది బలమైన పునాది వేస్తుందని ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు స్వదేశంలో స్థిరమైన జీవితం, మరోవైపు విదేశాల్లో సవాళ్లతో కూడిన సరికొత్త కెరీర్.. ఈ రెండింటి మధ్య సతమతమవుతున్న ఆ టెక్కీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
