పోరాడి ఓడిన మహిళా హాకీ ప్లేయర్‌‌కు రూ.25 లక్షలు

పోరాడి ఓడిన మహిళా హాకీ ప్లేయర్‌‌కు రూ.25 లక్షలు

అమరావతి: భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, గోల్ కీపర్ రజని బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులతలో కలసి ఆమె సీఎం జగన్ ను కలిశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఘనత సాధించి. రజని స్వగ్రామం తిరుపతి సమీపంలోని చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం గ్రామం. భారత్ తరపున 110 అంతర్జాతీయ హాకీ మ్యాచులలో రజనీ గోల్ కీపర్ గా ప్రాతినిధ్యం వహించారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ తోపాటు.. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లోనూ రజని పాల్గొన్నారు. 
ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్లు తిరుగులేని పోరాటం చేసి చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్స్ వరకు వెళ్లారు. కానీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయారు. బ్యాంజ్ మెడల్ గెలిచే అవకాశం రాగా.. ఆ మ్యాచ్‌లోనూ పోరాడి బ్రిటన్‌పై కేవలం ఒక్క గోల్ తేడాతో ఓటమిని చవిచూశారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఒలింపిక్స్‌లో మహిళా హాకీ టీమ్‌ను అక్కడి వరకూ తీసుకెళ్లి రికార్డు సృష్టించడంపై దేశమంతా గర్వించిందని ప్రధాని మోడీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలు మెచ్చుకున్నారు. 

ఒలింపిక్స్‌ ముగిశాక స్వదేశానికి తిరిగొచ్చిన.. హాకీ ప్లేయర్ రజని ఇవాళ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం..  జ్ఞాపికను బహూకరించారు. అంతేకాదు పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రజని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. రూ. 25లక్షల నగదు ఇవ్వాలని ఆదేశించారు. ఆమెకు గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి పెండింగ్‌లో ఉంచిన బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రజని కోరిక మేరకు తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ అధికారులు రామకృష్ణ, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.