యోగాసనాలు సాధారణంగా ఎంతసేపు వేయగలుగుతారు? మహా అయితే ఒక్కో ఆసనం ఐదు లేదా పది నిమిషాలు వేస్తారు. అంతకంటే ఎక్కువ సేపు ఆసనం వేయడం కాస్త కష్టమే. అలాంటిది ఒక యోగా టీచర్ దాదాపు అరగంట పాటు ఆసనం వేసి రికార్డులకు ఎక్కాడు. ఫిట్నెస్ కోసం యోగా చేస్తారని తెలుసు. కానీ, యోగాతో రికార్డుకెక్కొచ్చని ఇతన్ని చూస్తే తెలుస్తుంది. 22 ఏండ్ల యశ్ మొరాదియా ఒక యోగా టీచర్. పుట్టింది దుబాయిలో. కానీ, ప్రస్తుతం ఉండేది మనదేశంలోనే. ఇతను దాదాపు 29 నిమిషాల 4 సెకండ్లు వృశ్చికాసనం (స్కార్పియన్ పోజ్) వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. యోగా వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలియజేయడానికే ఇలా చేశానన్నాడు యశ్.ఈ పోజ్‌లో ఎక్కువ టైం ఉన్నందుకుగాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కింది.
స్కార్పియన్ పొజిషనే ఎందుకు వేశాడు? అంటే.. ‘‘ఇది స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్. ఈ పోజ్‌లో ఎంత ఎక్కువసేపు ఉంటే మానసికంగా అంత స్ట్రాంగ్ అవుతారు. ఒత్తిడి, ఇబ్బందులు వంటివి ఎదురైనప్పుడు, ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఆలోచనల పరిధి పెరుగుతుంది” అంటున్నాడు యశ్.
ఎనిమిదేండ్ల వయసు నుంచి యోగా ప్రాక్టీస్ చేసిన యశ్.. ఈ రికార్డు కోసం ఐదేండ్ల పాటు స్కార్పియన్ పోజ్ ప్రాక్టీస్ చేశాడు. తాను అనుకున్నట్టే రికార్డులకి ఎక్కాడు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే... మామూలుగా ఎవరైనా ఒక రికార్డు చేస్తే, ఇంకొకరు దానికంటే ఒక్క శాతం ఎక్కువ చేసినా మొదటి రికార్డును బ్రేక్ చేయొచ్చు. కానీ, ఇప్పుడు యశ్ సెట్ చేసిన ఈ రికార్డు బ్రేక్ చేయాలనుకుంటే మరో పదేండ్లు పట్టొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ రికార్డు 4 నిమిషాల 47 సెకన్లు మాత్రమే. యశ్ ఇప్పుడు దాన్ని 29 నిమిషాల 4సెకండ్లు చేశాడు. ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ చేసే వీరులు కూడా ఉంటారేమో.. చూడాలి మరి!
