ఉక్రెయిన్ నుంచి  మనోళ్లు వచ్చిన్రు

ఉక్రెయిన్ నుంచి  మనోళ్లు వచ్చిన్రు

రుమేనియా నుంచి 219 మందితో ముంబై చేరుకున్న తొలి విమానం

న్యూఢిల్లీ/ముంబై: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ‘‘ఆపరేషన్ గంగా’’ మిషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం మూడు ఎయిర్ ఇండియా విమానాలను పంపించింది. రుమేనియా రాజధాని బుకారెస్ట్ ఎయిర్ పోర్టు నుంచి 219 మందితో బయలుదేరిన  తొలి విమానం రాత్రి 7:50 గంటలకు ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనోళ్లకు స్వాగతం పలికారు. ‘‘వెల్ కమ్ బ్యాక్. ఆపరేషన్ గంగాలో ఇది మొదటి అడుగు ” అంటూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. మరో రెండు విమానాల్లో ఒకటి బుకారెస్ట్ నుంచి, మరొకటి హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్నట్లు ఆయన చెప్పారు. బుకారెస్ట్ నుంచి 250 మందితో విమానం బయలుదేరిందని, అది ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని తెలిపారు. ఉక్రెయిన్ నుంచి రుమేనియా, హంగేరీ బార్డర్లకు చేరుకున్న మనోళ్లను రోడ్డు మార్గంలో బుకారెస్ట్, బుడాపెస్ట్ ఎయిర్ పోర్టులకు తరలించి.. అక్కడి నుంచి విమానాల్లో తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 22న కీవ్ నుంచి 240 మంది మనోళ్లను కేంద్రం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మూతపడడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బుకారెస్ట్, బుడాపెస్ట్ ల నుంచి విమానాలు నడుపుతోంది. ఉక్రెయిన్​లో మనోళ్లు మొత్తం 16 వేల మంది దాకా ఉన్నారని, వారిలో ఎక్కువ మంది స్టూడెంట్లేనని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. 

చెప్పకుండా బార్డర్లకు వెళ్లొద్దు: ఎంబసీ 
ఉక్రెయిన్​లోని ఇండియన్లు తమతో చెప్పకుండా బార్డర్లకు వెళ్లొద్దని ఆ దేశంలోని మన ఎంబసీ సూచించింది. సమాచారం ఇవ్వకుండా బార్డర్లకు వెళ్తున్నోళ్లను తీసుకెళ్లడం కష్టమవుతోందని చెప్పింది. చెక్​పోస్టులలో సున్నితమైన పరిస్థితులున్నాయని, మనోళ్లను తరలించేందుకు ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడుతున్నామని తెలిపింది. పశ్చిమ ఉక్రెయిన్ లోని సిటీల్లో ఉన్నోళ్లు అక్కడ ఉండడమే మంచిదని చెప్పింది. తూర్పు సెక్టార్ లో ఉన్నోళ్లు తాము చెప్పే వరకూ ఎటూ వెళ్లొద్దంది.  

ఉక్రెయిన్​లో 423 మంది ఏపీ స్టూడెంట్లు
ఆంధ్రప్రదేశ్​కు చెందిన 423 మంది స్టూడెంట్లు ఉక్రెయిన్​లో ఉన్నారని, వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నామని ఏపీ సర్కారు తెలిపింది. అక్కడ వేర్వేరు యూనివర్సిటీల్లో ఉన్న వీళ్లందరికీ ఎప్పటికప్పడు సూచనలిస్తున్నామని ఏపీ స్పెషల్ టాస్క్​ఫోర్ చైర్మన్ కృష్ణబాబు చెప్పారు. 23 మంది తెలుగువాళ్లను తీసుకొస్తున్నామని కేంద్రం చెప్పిందని, అయితే అందులో ముగ్గురు మాత్రమే ఏపీకి చెందిన వాళ్లున్నారని తెలిపారు.