యూరప్ లోనూ యూపీఐ, రూపే పేమెంట్స్

యూరప్ లోనూ యూపీఐ, రూపే పేమెంట్స్

త్వరలో ఇండియన్స్ యూరప్ లోనూ నేరుగా యూపీఐ, రూపే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాంటి తడబాటు లేకుండా ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ ను జరపొచ్చు.  ఇందుకోసం యూరప్ దేశాల్లో డిజిటల్ పేమెంట్ సేవలు అందించే ప్రముఖ కంపెనీ ‘వరల్డ్ లైన్’ తో  నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జట్టు కట్టింది. పరస్పరం కలిసి పనిచేసేందుకు సంబంధించి ఈ రెండు కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.  

దీంతో డిజిటల్ లావాదేవీల విప్లవం దిశగా భారత్ మరో ముందడుగు వేసినట్లయింది. రానున్న రోజుల్లో యూరప్ దేశాల్లో భారతీయులు ఫోన్ల నుంచి జరిపే యూపీఐ పేమెంట్స్ కు వరల్డ్ లైన్ కు చెందిన క్యూఆర్ కోడ్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. ఆయా దేశాల్లోని అన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలలోనూ రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా భారతీయులు చెల్లింపులు చేయొచ్చు. ప్రధానంగా భారత్ నుంచి ఐరోపా దేశాలకు వెళ్లే టూరిస్టులకు, విద్యార్థులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడనుంది.  

ఇంతకుముందు వరకు భారతీయులు ఐరోపా దేశాలకు వెళ్లిన సందర్భాల్లో ఇంటర్నేషనల్ కార్డ్ నెట్ వర్క్స్ ద్వారా పేమెంట్స్ జరిపేవారు.  ఎన్పీసీఐ ఇప్పటివరకు దాదాపు 71.4 కోట్ల రూపే కార్డులను దేశంలోని ప్రజలకు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్  పరిధిలో ఎన్పీసీఐ  పనిచేస్తుంది.