
న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నా.. ఆస్ట్రేలియాలో టీమిండియా టూర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ అన్నారు. అక్టోబర్‌లో జరిగే ఈ సిరీస్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆసీస్ టూర్ సాధ్యమైనప్పుడు.. షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్ కప్ కూడా జరుగుతుందని సంకేతాలిచ్చారు. ‘టూర్‌కు వెళ్లే ముందు ఇండియా ప్లేయర్లు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి పాటించాల్సిందే. అయితే సిరీస్ టైమ్‌కు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పటికైతే ఆసీస్ టూర్, టీ20 వరల్డ్‌కప్ కొనసాగుతున్నట్టే. కాకపోతే టోర్నీ సందర్భంగా ట్రావెలింగ్ తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే ప్రతి ఓవర్‌సీస్ టూర్‌కు ముందు ఇలా క్వారంటైన్‌లో ఉంచడం వల్ల మ్యాచ్‌లు నిర్వహించడం చాలా కష్టం’ అని ధుమాల్ పేర్కొన్నారు. అక్టోబర్, నవంబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు లాజిస్టిక్ సమస్యలు చాలా ఎదురవుతాయన్నారు. ‘16 టీమ్‌లను ఆసీస్‌కు తీసుకొచ్చి.. రెండు వారాలు క్వారంటైన్‌లో ఉంచడం సాధ్యమేనా? ఇప్పటికే ప్లేయర్లు క్రికెట్‌కు దూరమై చాలా కాలమైంది. మళ్లీ రెండు వారాల క్వారంటైన్ తర్వాత నేరుగా టీ20 వరల్డ్‌కప్ ఆడాలంటే ఇంట్రెస్ట్ చూపుతారా? ఇందులో క్లారిటీ లేదు. లాక్‌డౌన్ ముగిసి పరిస్థితులు మెరుగుపడితే ప్లేయర్ల సేఫ్టీ, హెల్త్‌పై దృష్టిపెట్టొచ్చు. ఇది మాకు అతి ముఖ్యమైన అంశం. అప్పటి పరిస్థితులను బట్టి వరల్డ్‌కప్‌పై నిర్ణయాలు ఉంటాయి’ అని ధుమాల్ వివరించారు.
లాక్‌డౌన్ తర్వాతే క్లారిటీ
ఆసీస్ టూర్‌కు లాజిస్టిక్ సమస్య తక్కువగా ఉండటంతో మ్యాచ్‌ల నిర్వహణ ఈజీగా ఉంటుందని ధుమాల్ చెప్పారు. ‘ఆ టైమ్‌లో రెండు దేశాల గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఎలా ఉంటాయో చూడాలి. టీమ్‌లు ట్రావెలింగ్ చేయొచ్చా? లేదా తెలియదు. ఇప్పటికైతే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్‌పై క్లారిటీ లేదు. మినహాయింపులు ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం అంతా గందరగోళంగా ఉంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం. లాక్‌డౌన్‌కు ముందే ఐదో టెస్ట్‌పై చర్చించాం. క్రికెట్ మొదలయ్యాక దీని హోస్టింగ్ గురించి ఆలోచిస్తాం. అయితే టెస్ట్ మ్యాచ్ కంటే 2 టీ20లు నిర్వహించడం వల్ల ఎక్కువ రెవెన్యూను రాబట్టుకోవచ్చు’ అని ధుమాల్ వ్యాఖ్యానించారు.