
- ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్‌తో కలిసి చేస్తం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లను మన దేశంలో తయారు చేయనున్నట్టు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్‌తో కలిసి ఇంజిన్లను తయారు చేస్తామని, ఈ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. శనివారం ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ సమిట్‌లో రాజ్‌నాథ్ మాట్లాడారు.
‘‘మేం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారీలో ముందడుగు వేశాం. విమానాల ఇంజిన్ల తయారీ దిశగానూ ముందుకు సాగుతున్నాం. ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్‌తో కలిసి మన దేశంలోనే ఇంజిన్లను తయారు చేయనున్నాం. త్వరలోనే పనులు ప్రారంభించనున్నాం” అని ఆయన వెల్లడించారు. స్వదేశంలోనే తయారు చేయడంలో ఇప్పటికే కీలక ముందడుగు వేశామని పేర్కొన్నారు.
‘‘మన దేశ రక్షణ సామర్థ్యాలకు తేజస్ యుద్ధ విమానాలు గొప్ప ఉదాహరణగా నిలవనున్నాయి. ఈ ప్రయత్నంలో మేం సవాళ్లేమీ ఎదుర్కోవడం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్తున్నాం. యుద్ధ విమానాలను పూర్తి స్థాయిలో మన దేశంలోనే తయారు చేసే విధంగా సౌలతులు కల్పిస్తున్నాం” అని తెలిపారు.