తగ్గిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌‌‌‌

తగ్గిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌‌‌‌

ముంబై: ఈ ఏడాది జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  భారత్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌‌‌‌  (సీఏడీ)  2.4 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.2 శాతాని)కి తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో సీఏడీ 8.6 బిలియన్ డాలర్లుగా  (జీడీపీలో 0.9శాతం)గా ఉంది. సీఏడీ అంటే ఒక దేశానికి చెందిన  విదేశీ వాణిజ్యంలో దిగుమతుల విలువ ఎగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.  

ఇందులో వస్తువులు, సేవలు, ఆదాయం, బదిలీ చెల్లింపులు (ట్రాన్స్‌‌‌‌ఫర్ పేమెంట్స్) ఉంటాయి. 2024–25లో మొత్తం సీఏడీ  23.3 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.6శాతంగా) నమోదైంది.  ఇది 2023–24లో నమోదైన  26 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.7శాతం)తో పోలిస్తే తక్కువ. జూన్  క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌  68.5 బిలియన్ డాలర్లు కాగా, సేవల ఎగుమతుల ఆదాయం  47.9 బిలియన్‌‌‌‌ డాలర్లకు పెరిగింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్ (ఎఫ్‌‌‌‌డీఐ)  నెట్ ఇన్‌‌‌‌ఫ్లో  5.7 బిలియన్ డాలర్లుగా , ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్  (ఎఫ్‌‌‌‌పీఐ) 1.6 బిలియన్‌‌‌‌ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా బిజినెస్, కంప్యూటర్ సేవల ఎగుమతులు పెరిగాయి.