అమెరికాకు తగ్గినా.. 24 దేశాలకు ఎగుమతులు జూమ్‌‌‌‌‌‌‌‌

అమెరికాకు తగ్గినా.. 24 దేశాలకు ఎగుమతులు జూమ్‌‌‌‌‌‌‌‌
  • ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ పడిపోవడానికి ట్రంప్ సుంకాలే కారణం 
  • ఇతర దేశాలపై ఫోకస్ పెట్టిన ఇండియా
  • ఏప్రిల్‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16 దేశాలకు తగ్గిన ఎగుమతులు
  • క్యాడ్ కంట్రోల్లో ఉంటుందని క్రిసిల్ అంచనా

న్యూఢిల్లీ:  భారత వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు వేస్తుండడంతో ఈ దేశానికి మన ఎగుమతులు తగ్గాయి. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఇతర దేశాలతో వ్యాపారం పెరిగింది. సుమారు 24 దేశాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో భారతదేశం నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతులు ఏడాది లెక్కన 11.9శాతం తగ్గి 5.5 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకి పరిమితమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో యూఎస్‌‌‌‌‌‌‌‌కు ఎగుమతులు 7శాతం పెరిగిన విషయం తెలిసిందే. 

రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం,  అమెరికా ప్రభుత్వం ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50శాతం టారిఫ్ విధించడంతో ఎగుమతులు తగ్గాయి. టారిఫ్ పెరుగుదలకు  ముందే షిప్‌‌‌‌‌‌‌‌మెంట్లు జరపడంతో ఎగుమతుల తగ్గుదల ఎక్కువగా కనిపించలేదు.  అమెరికా కాకుండా ఇతర దేశాలకు భారత ఎగుమతులు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఏడాది లెక్కన 10.9శాతం పెరిగాయి. ఇది ఆగస్టులో నమోదైన 6.6శాతం వృద్ధితో పోలిస్తే ఎక్కువ. కాగా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనేజేషన్ (డబ్ల్యూటీఓ) ఈ ఏడాది  గ్లోబల్ ట్రేడ్ వాల్యూమ్స్  2.4శాతమే  పెరుతాయని అంచనా వేసింది.  

ఇది 2024లో నమోదైన 2.8శాతం వృద్ధితో పోలిస్తే కొంత తక్కువ. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సవాళ్లు ఉన్నా ఇండియా తన కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌‌‌‌‌‌‌‌ (క్యాడ్‌‌‌‌‌‌‌‌– ఖర్చులు మైనస్ ఆదాయం)ను  నియంత్రణలో ఉంచుతోందని క్రిసిల్ పేర్కొంది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు పెరగడం, స్థిరంగా రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌ వస్తుండడం, ముడి చమురు ధరల తగ్గుదలతో క్యాడ్‌‌‌‌‌‌‌‌ని సమర్థవంతంగా బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ చేయడానికి వీలవుతోందని అభిప్రాయపడింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యాడ్‌‌‌‌‌‌‌‌ జీడీపీలో ఒక శాతంగా ఉండొచ్చని ఈ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.  ఇది గత సంవత్సరం నమోదైన 0.6శాతంతో పోలిస్తే కొంత ఎక్కువ.

మన ఎగుమతుల్లో 59 శాతం ఈ దేశాలకే..

అమెరికాకు  ఎగుమతులు తగ్గినప్పటికీ, భారత ఎగుమతిదారులు ఇతర దేశాలకు ఎగుమతులను విస్తరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 24 దేశాలకు 129.3 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇది మొత్తం భారత ఎగుమతుల్లో 59శాతం వాటాకు సమానం. ఈ దేశాల్లో కొరియా, యూఏఈ, జర్మనీ, టోగో, ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌,  వియత్నాం, ఇరాక్‌‌‌‌‌‌‌‌, మెక్సికో, రష్యా,  కెన్యా, నైజీరియా, బ్రెజిల్, బెల్జియం, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్, బంగ్లాదేశ్, ఇటలీ, టాంజానియా వంటి దేశాలు ఉన్నాయి. అదే సమయంలో, 16 దేశాలకు భారత ఎగుమతులు తగ్గాయి.   

ఇవి మొత్తం ఎగుమతుల్లో 27శాతం (60.3 బిలియన్ డాలర్లు) వాటాకు సమానం. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో అమెరికాకు ఎగుమతులు  తగ్గినా,  ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ దేశానికి జరిపిన మొత్తం ఎగుమతులు ఏడాది లెక్కన 13.37శాతం పెరిగి 45.82 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకి చేరాయి.  దిగుమతులు 9శాతం పెరిగి 25.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లుగా నమోదయ్యాయి.  కాగా, అమెరికా 2024-–25లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 

ప్రస్తుతం రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి.  ఈ ఏడాది చివరిలోపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ, అది సమీప కాలంలో అయ్యేటట్టు కనిపించడం లేదు.   అమెరికా టారిఫ్‌‌‌‌‌‌‌‌లు భారత ఎగుమతులను దెబ్బతీస్తున్నా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌  దేశాలకు ఎగుమతులను పెంచే దిశగా ఇండియా ప్రయత్నాలు జరుపుతోందని ఎగుమతిదారులు పేర్కొన్నారు. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లోనూ కనిపిస్తుందని అన్నారు.