ఇండోర్: సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించే టీమిండియాకు కఠిన పరీక్ష. ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగే మూడో వన్డే మ్యాచ్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని ఇండియా.. న్యూజిలాండ్‌తో చావోరేవో తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1–-1తో సమంగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించడమే కాకుండా, ఇరు జట్ల ప్రతిష్టకు కీలకంగా మారింది. ఇండియా 2019 మార్చి తర్వాత స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్‌ను కూడా కోల్పోలేదు.
అప్పట్లో ఆస్ట్రేలియా 0–-2తో వెనుకబడి ఉండి కూడా అనూహ్యంగా పుంజుకుని 3–-2తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇండియా ఆధిపత్యం ప్రమాదంలో పడింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో న్యూజిలాండ్ చేతిలో ఇప్పటికే సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఇండియా, ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓటమి, ఆపై సొంతగడ్డపై టెస్టుల్లో వైఫల్యాలు కోచ్ గంభీర్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి.
రోహిత్ ఫామ్.. టీమ్ కాంబినేషన్‌పై టెన్షన్
రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో ఇండియా ఓటమికి ప్రధాన కారణం మిడిల్ ఓవర్లలో స్పిన్‌ను ఎదుర్కోవడంలో విఫలమవ్వడమే. డారిల్ మిచెల్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పాడు. కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోయారు. కానీ, మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇండియా బ్యాటర్లు ఇబ్బందిపడుతున్నారు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. తనదైన దూకుడుతో ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నా, భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. జులైలో ఇంగ్లండ్ టూర్ వరకు సీనియర్లకు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి అభిమానులు మరోసారి రో-కో (రోహిత్–-కోహ్లీ) షో కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంకోవైపు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకలా నిలిచాడు. వన్డేల్లో టాప్ ర్యాంక్‌కు చేరుకున్న కోహ్లీ అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక, నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సీమ్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తుండగా, ఆయుష్ బదోని స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. ఇండోర్ పిచ్ దృష్ట్యా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ కోసం లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అతని వైవిధ్యమైన బౌలింగ్, డెత్ ఓవర్లలో యార్కర్లు వేయగల సామర్థ్యం జట్టుకు కలిసిరావచ్చు. అయితే సిరాజ్ లేదా ప్రసిధ్ కృష్ణలలో ఎవరి స్థానంలో అతను వస్తాడనేది చూడాలి.
చరిత్రపై కన్నేసిన కివీస్
అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగినప్పటికీ న్యూజిలాండ్ అద్భుతంగా ఆడుతోంది. కివీస్ ప్రధాన బలమైన డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిచెల్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇండియాకు పెద్ద సవాల్‌గా మారింది. న్యూజిలాండ్ బౌలర్లు పెద్దగా పేరున్న వారు కాకపోయినా, స్లో బాల్స్.. వైవిధ్యమైన లెంగ్త్‌లతో ఇండియా బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే కివీస్ చరిత్ర సృష్టించనుంది. 1989 నుంచి ఇండియాలో సిరీస్‌లు ఆడుతున్నా ఇప్పటివరకు ఆ జట్టు ఒక్కసారి కూడా ఇక్కడ వన్డే సిరీస్ గెలవలేదు. గతేడాది టెస్టు సిరీస్‌లో ఇండియాను వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న బ్లాక్‌క్యాప్స్ టీమ్ ఇప్పుడు వన్డేల్లోనూ అదే ఫీట్‌ను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. కాబట్టి గిల్ సేన ఎలాంటి తప్పిదానికీ తావివ్వకుండా ఆడాల్సి ఉంటుంది.
పిచ్/వాతావరణం
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ గ్రౌండ్‌లోనే సెహ్వాగ్ డబుల్ సెంచరీ (219) కొట్టాడు. ఇండియా ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో 399, 385 రన్స్ చేసింది. ఈ పోరులో కూడా పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ఆదివారం వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ (కీపర్), నితీష్ రెడ్డి/బదోని, జడేజా, హర్షిత్, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ/అర్ష్‌దీప్, సిరాజ్.
న్యూజిలాండ్: కాన్వే, నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, మిచెల్ హే ( కీపర్), గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, జేమీసన్, ఫౌల్క్స్, ఆదిత్య అశోక్/జేడెన్ లెనాక్స్.
