200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు పట్టాలు రెడీ..

200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు పట్టాలు రెడీ..

దేశంలోని మొట్టమొదటి ఫాస్ట్ రైల్వే టెస్ట్ ట్రాక్ కలను భారతీయ రైల్వే త్వరలో సాకారం చేసుకోబోతోంది. దీని ట్రయల్ ట్రాక్ అక్టోబర్ 2024 నాటికి అందుబాటులోకి రానుంది. రాజస్థాన్‌లోని దిద్వానా జిల్లాలోని నవన్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ నిర్మితమవుతోందని CPRO నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) అధికారి ఒకరు తెలిపారు. సుమారు రూ.819.90కోట్ల అంచనా వ్యయంతో రూపొందుతోన్న ఈ 60కిలో మీటర్ల రైల్వే ట్రాక్.. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ప్రపంచ దేశాల తరహాలో దేశంలోనే తొలి రైల్వే టెస్ట్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగుతోంది.   

దేశంలోనే తొలి రైల్వే టెస్ట్‌ట్రాక్‌ను జోథ్ పూర్ డివిజన్‌లోని నవాన్‌లో రైల్వేశాఖ ప్రారంభించిందని.. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియాలో ఉన్న ట్రాక్‌ల తరహాలో దీన్ని నిర్మిస్తున్నామని సీపీఆర్వో నార్త్ వెస్టర్న్ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్) కెప్టెన్ శశికిరణ్ తెలిపారు. దీని నిర్మాణంతో దేశం రైల్వే రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను అందించగలదని చెప్పారు. నార్త్-వెస్ట్రన్ రైల్వే జోధ్‌పూర్ డివిజన్ అభివృద్ధి చేస్తున్న సుమారు 60 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే టెస్ట్ ట్రాక్ నిర్మాణ పనులను దశలవారీగా ప్రారంభించినట్లు శశి కిరణ్ తెలిపారు.                

సంబంధిత భూమిని సేకరించేందుకు రైల్వే ఇప్పటికే ఆ ప్రక్రియను పూర్తి చేసిందని శశి కిరణ్ చెప్పారు. సగానికి పైగా టెస్ట్ ట్రాక్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. ఇందులో మొదటి దశగా 25 కిలోమీటర్లు, దీని కింద మేజర్ బ్రిడ్జి 95 శాతం నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో పాటు, ఈ ట్రాక్‌పై టెస్టింగ్ ప్రయోజనాల కోసం 34 చిన్న వంతెనలను కూడా నిర్మిస్తున్నారనిని శశికిరణ్ చెప్పారు. రెండో దశ నిర్మాణ పనుల్లో భాగంగా వర్క్‌షాప్‌లు, లేబొరేటరీలు, నివాసాలను కూడా నిర్మించాలని రైల్వే యోచిస్తోందని తెలిపారు.