గుజరాత్లో స్టీల్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డు

గుజరాత్లో స్టీల్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డు

సూరత్ : గుజరాత్ లోని సూరత్ లో దేశంలోని తొలి స్టీల్ రోడ్డు వినియోగంలోకి వచ్చింది. సూరత్లోని హజిరా పారిశ్రామిక ప్రాంతంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, స్టీల్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ సంయుక్తంగా ఈ రోడ్డు నిర్మించాయి. 1.2కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ స్టీల్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆరు లేన్ల ఈ హైవే కోసం స్టీల్ తయారీలో వెలువడే కంకర లాంటి వ్యర్థాలను ఉపయోగించారు. సీఎస్ఆర్ఐ సూచనల మేరకు స్టీల్ రోడ్డు మందాన్ని 30 శాతం మేర తగ్గించారు. వర్షాకాలంలోనూ ఈ రోడ్డు చెక్కు చెదరదని అధికారులు అంటున్నారు. 

పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్టీల్ రోడ్డుపై నిత్యం భారీ బరువులతో కూడిన వెయ్యికిపైగా లారీలు వెళ్తున్నాయి. అయినా అది చెక్కు చెదరలేదని సీఆర్ఆర్ఐ సెంటిస్ట్ సతీష్ పాండే చెప్పారు. స్టీల్ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల రోడ్డు నిర్మాణ ఖర్చులు 30శాతం వరకు తగ్గనుంది. పర్యావరణానికి హాని కలిగించే ఉక్కు వ్యర్థాలతో స్టీల్ ప్లాంటులు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలను ఉపయోగించి రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలోని స్టీల్ పరిశ్రమలు ఏటా 19 మిలియన్ టన్నుల ఉక్కు వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి. 2030 నాటికి  ఇది 5 మిలియన్ టన్నులకు చేరుకోనుంది. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్టీల్ రోడ్డు సక్సెస్ కావడంపై అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. త్వరలోనే మరిన్ని రోడ్లు, హైవేలను స్టీల్ వ్యర్థాలతో నిర్మించేందుకు CSIR CRRI ప్లాన్ చేస్తున్నాయి.