న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. దూకుడుగా ఆడే వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీని తీసుకోవాలా..? లేక అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌కు చాన్స్ ఇవ్వాలా..? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
ఇంగ్లండ్ టూర్‌లో శాంసన్ ప్లేస్‌లో వైభవ్‌ను తీసుకున్నా.. మళ్లీ చివరి మ్యాచ్‌లో తప్పించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి. ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మతో కలిసి శాంసన్ నిలకడైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం తుది జట్టును ఖరారు చేసే ముందు వీలైతే శాంసన్, వైభవ్‌కు సమాన అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావిస్తున్నారు.
శుక్రవారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో వైభవ్ తడబడగా, శాంసన్ నియంత్రణతో ఆడాడు. అయితే అఫ్గాన్ జట్టులో బుమ్రా స్థాయిలో బౌలింగ్ చేసే బౌలర్ లేకపోవడం వైభవ్‌కు కలిసొచ్చే అంశం. నెట్ ప్రాక్టీస్‌లో వీపు నొప్పికి గురైన ఇషాన్ కిషన్‌ను తీసుకోకపోతే అతని ప్లేస్‌లో శాంసన్ రావొచ్చు.
బౌలింగ్‌లోనూ పేసర్లుగా బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆడే చాన్స్ ఉంది. అయితే మూడో స్పెషలిస్ట్ బౌలర్‌గా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారా..? లేక పేసర్ యశ్ ఠాకూర్‌కు చాన్స్ ఇస్తారా..? చూడాలి.
స్పిన్నర్లపైనే భారం..
మరోవైపు అఫ్గానిస్తాన్ స్పిన్నర్లపైనే ఎక్కువ భారం వేసింది. ఐపీఎల్లో రాణించినరషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ నుంచి ఇండియా బ్యాటర్లకు ముప్పు తప్పకపోవచ్చు. పేస్ బౌలింగ్‌లో ఫజల్‌హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్‌తో పాటు ఆల్‌రౌండర్లు గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మద్దతు కూడా ఉంటే అఫ్గానిస్తాన్‌కు ఇబ్బందులు తప్పినట్లే. బ్యాటింగ్‌లో రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెడిఖుల్లా అటల్, డార్విష్ రసూలీ అంచనాలను అందుకుంటే భారీ స్కోరును ఆశించొచ్చు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ / సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రెహమానుల్లా గుర్బాజ్, గుల్బాదిన్ నైట్, సెడిఖుల్లా అటల్, డ్వారిష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ ఖాన్, ఫజల్‌హక్ ఫారూఖీ/ నవీన్ ఉల్ హక్.
పిచ్, వాతావరణం
దాదాపుగా బ్యాటింగ్ పిచ్. బౌండ్రీ లైన్ చిన్నదిగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే చాన్స్. వర్షం ముప్పు లేదు.
ఈ సిరీస్‌లో సూర్యవంశీకి ఆడే అవకాశం లభిస్తే, ఇండియాలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 'ఫుల్ మెంబర్' జట్టుకు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలుస్తాడు. కెప్టెన్‌గా తన మొదటి తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. ఇది ఇప్పటికే ఒక రికార్డు.
