ఉద్యోగం వదిలి ఫిషింగ్ వ్లాగింగ్‌‌ యూ ట్యూబర్ గా

ఉద్యోగం వదిలి ఫిషింగ్  వ్లాగింగ్‌‌ యూ ట్యూబర్ గా

కెనడా వెళ్లాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టే కష్టపడి చదివాడు. చివరికి మంచి ఉద్యోగం సాధించాడు. కానీ.. ఖాళీ టైంలో హాబీగా మొదలైన ‘ఫిషింగ్‌‌ వ్లాగింగ్‌‌’ అతన్ని కేరళ నుంచి వెళ్లనివ్వలేదు. ఆ ఫిషింగ్ ప్యాషన్‌‌తోనే కెనడా ప్రయాణానికి గుడ్‌‌బై చెప్పి ఫుల్‌‌ టైం యూట్యూబర్‌‌‌‌గా మారాడు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతని చానెల్‌‌ ‘ఫిషింగ్ ఫ్రీక్స్’లో ఫిషింగ్‌‌తోపాటు కేరళ గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, ప్రకృతి సంరక్షణకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఎంతోమందినిఇన్‌‌స్పైర్‌‌‌‌ చేస్తున్నాడు. 

సెబిన్ సైరియాక్ 1992లో కేరళలోని కొట్టాయం జిల్లాలోని అర్పూక్కరలో పుట్టాడు. చిన్నప్పటినుంచి చదువులో ముందుండేవాడు. విదేశాలకు వెళ్లి సెటిల్‌‌ కావాలని కలలు కనేవాడు. డిగ్రీ తర్వాత ఎలక్ట్రానిక్స్‌‌లో ఎంఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత కెనడాకు వెళ్లేందుకు ప్లాన్‌‌ చేసుకున్నాడు. అప్పుడు కొంత ఖాళీ టైం దొరకడంతో ఇంటర్నేషనల్‌‌ ఇంగ్లిష్‌‌ లాంగ్వేజ్‌‌ టెస్టింగ్‌‌ సిస్టమ్‌‌(ఐఈఎల్‌‌టీఎస్‌‌) ట్యూటర్‌‌గా పనిచేశాడు. ఫ్రీ టైమ్‌‌లో ఫిషింగ్ చేసేవాడు. అదే టైంలో ‘ఫిషింగ్ ఫ్రీక్స్’ పేరుతో యూట్యూబ్‌‌ చానెల్ పెట్టాడు. అందమైన ప్రదేశాల్లో ఫిషింగ్‌‌ చేసేటప్పుడు ఫోన్‌‌లో వీడియోలు తీసి, వాటిని సరదాగా ఆ చానెల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసేవాడు. అలా కొన్నాళ్లకు వ్యూయర్స్‌‌ నుంచి ప్రశంసలు వచ్చాయి. వీడియోలు చాలా బాగున్నాయని ఎంతోమంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లు, లైక్స్‌‌, పాజిటివ్ ఫీడ్‌‌బ్యాక్స్‌‌ అతని ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. కాలక్షేపంగా మొదలైన ఫిషింగ్‌‌ వ్లాగింగ్‌‌నే కెరీర్‌‌‌‌గా ఎంచుకునేలా చేశాయి. దాంతో తన కలలను, ఉద్యోగాన్ని వదులుకుని 24 ఏండ్ల వయసులో ఫుల్-టైమ్ కంటెంట్ క్రియేటర్‌‌గా మారిపోయాడు. అందుకే ‘‘నా మొత్తం ఎనర్జీని ఈ చానెల్‌‌కు ఇచ్చాను” అని సెబిన్ తన చానెల్‌‌ డిస్క్రిప్షన్‌‌లో రాసుకున్నాడు. 

వీడియోల్లో ఏముందంటే.. 

‘ఫిషింగ్ ఫ్రీక్స్’ చానెల్‌‌లోని వీడియోల్లో కేరళ గ్రామీణ జీవితం, ప్రకృతి అందాలు, సంప్రదాయ ఫిషింగ్‌‌ పద్ధతుల (వెదురు కర్రలతో చేపలు పట్టే విధానం) నుంచి మోడర్న్ గాడ్జెట్స్ (హై-టెక్ ఫిషింగ్ టూల్స్) వరకు ప్రతిదీ చూపిస్తుంటాడు. కొట్టాయం, ఎర్నాకులం లాంటి ప్రాంతాల్లోని నదులు, చెరువులు, సముద్రాల దగ్గర ఎక్కువగా వీడియోలు చేస్తుంటాడు. పచ్చని పరిసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మనుషుల కల్మషం లేని ప్రేమ, అక్కడి నాస్టాల్జిక్ ఎలిమెంట్స్‌‌ మనసుని కట్టిపడేస్తాయి. 85 ఏళ్ల తాత, తమ్ముడు జినో సైరియాక్‌‌, ఫ్రెండ్‌‌ జోబిన్ జేమ్స్‌‌ను (కెమెరామన్) రెగ్యులర్‌‌‌‌గా వీడియోల్లో చూపిస్తూ... కుటుంబ బంధాలను హైలైట్ చేస్తాడు. పెట్స్, ఆటోమొబైల్స్, సెలబ్రేషన్స్ కూడా సెబిన్ చేసే కంటెంట్‌‌లో పదే పదే కనిపిస్తుంటాయి. కంటెంట్‌‌ని ఇండియాతోపాటు విదేశాల్లోని వ్యూయర్స్‌‌కి కూడా నచ్చేలా ఎంటర్‌‌టైనింగ్‌‌గా ఉండేలా డిజైన్ చేస్తాడు. ప్రతి వీడియోలో ప్రకృతి సంరక్షణ, యువతను ఔట్‌‌డోర్ యాక్టివిటీల వైపు ఆకర్షించే మెసేజ్ ఉంటుంది. 

కరోనా టైంలో.. 

సెబిన్‌‌ 2017 నవంబర్‌‌‌‌లో చానెల్‌‌ పెట్టాడు. కానీ.. 2018 సెప్టెంబర్‌‌‌‌లో మొదటి వీడియో అప్‌‌లోడ్‌‌ చేశాడు. చానెల్‌‌కు సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. దేశంలోకి కరోనా మహమ్మారి వచ్చేనాటికి సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య 3 లక్షలకు చేరింది. 2020 చివరి నాటికి ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఇది సెబిన్ సక్సెస్‌‌కు మొదటి మైల్‌‌స్టోన్. ప్రస్తుతం చానెల్‌‌ని 3.77 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ప్రతి రోజూ వీడియోలకు లక్షల్లో వ్యూస్‌‌ వస్తున్నాయి. ఇప్పుడిది దేశంలోని టాప్ ఫిషింగ్ చానెల్స్‌‌లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం చానెల్‌‌లో 790 వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్‌‌తోపాటు వెబ్‌‌సైట్ ద్వారా చేసే ఫిషింగ్ గాడ్జెట్స్ అమ్మకాల ద్వారా కూడా ప్రతినెలా కొంత ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో గ్లోబల్ ఫిషింగ్ ట్రిప్స్ చేసేందుకు ప్లాన్‌‌ చేస్తున్నాడు సెబిన్‌‌. ఈ చానెల్‌‌ సక్సెస్‌‌ అయిన తర్వాత 2023లో సెబిన్ సెకండ్‌‌ చానెల్‌  ‘ఫిషింగ్ ఫ్రీక్స్ ఫ్యామిలీ’ని కూడా మొదలుపెట్టాడు. అందులో రెగ్యులర్‌‌‌‌గా ఫ్యామిలీ వ్లాగ్స్‌‌ చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి 2.16 లక్షల మంది సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు.