భారత్ ఎప్పటికీ శాంతియుతంగా, బాధ్యతగానే ఉంటుంది: అమెరికాకు జైశంకర్ రిప్లై..

భారత్ ఎప్పటికీ శాంతియుతంగా, బాధ్యతగానే ఉంటుంది: అమెరికాకు జైశంకర్ రిప్లై..

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.. శనివారం ( మే 10 ) పాక్ ప్రభుత్వం భారత దళాలపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత తీవ్రం అయ్యింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. సంయవనం పాటించాలని ఇరుదేశాలకు సూచించింది అమెరికా.ఈమేరకు అమెరికా విదేశాంగ సెక్రెటరీ మార్కో రూబియో భారత్, పాక్ విదేశాంగ మంత్రులతో వేరువేరుగా ఫోన్లో సంభాషించారు. 

ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ సెక్రెటరీ మార్కో రూబియోతో ఫోన్ సంభాషణను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జైశంకర్. అమెరికా విదేశాంగ సెక్రెటరీ మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడానని.. ఇండియా ఎప్పుడూ బాధ్యతగానే వ్యవహరిస్తుందని అన్నారు జైశంకర్. 

భవిష్యత్ వివాదాలను నివారించడంలో అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. ఈమేరకు అమెరికా విదేశాంగ సెక్రెటరీ మార్కో రూబియో స్పష్టం చేసినట్లు తెలిపారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్. ఆయన గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో మాట్లాడి, సంయమనం, దౌత్యపరమైన ఒప్పందాలకు పిలుపునిచ్చారని అన్నారు.

కాగా.. భారత దళాలపై ప్రత్యక్ష యుద్దానికి సిద్ధమని.. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభిస్తున్నామని పాక్ ప్రభుత్వం ప్రకటించటంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. భారత్ పై పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు ప్రకటించింది పాక్. ఆపరేషన్ బన్‌యన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది పాక్. శనివారం ( మే 10 ) నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు ఆ దేశ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరీ.

ఈ క్రమంలో పాక్ దాడులను మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడి చేసినట్లు తెలుస్తోంది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తో పాటు మురిద్‌, షార్‌కోట్‌ వైమానిక స్థావరాలపై భారత్‌ దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే భారత ఆర్మీ దాటికి విలవిలలాడుతున్న పాక్.. ప్రపంచవ్యాప్తంగా ఏకాకిగా మారింది. ఈ పరిస్థితిలో ప్రత్యక్ష యుద్దానికి సిద్దమైన పాక్.. భారత్ దాడిని ఏమేరకు ఎదుర్కొంటుందో చూడాలి.