యాదాద్రి, వెలుగు : క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన యువత కారణంగానే భారత్ మరింత శక్తివంతం అవుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం నిర్వహించిన ‘సంసద్ ఖేల్’ బహుమతి ప్రధానోత్సవంలో క్రీడాకారులను అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో 20 వేల మంది యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం సంసద్ ఖేల్ పోటీలు నిర్వహించిందన్నారు.
వ్యక్తిత్వ నిర్మాణంలో క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఆటల కారణంగా ఆత్మ విశ్వాసం, ఓర్పు, సహనం, టీమ్ స్పిరిట్ పెంపొందుతాయని చెప్పారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే చదువులో సైతం ప్రతిభ చూపుతారన్నారు. అందుకే కేంద్రం ‘ఖేలో ఇండియా- ఫిట్ ఇండియా’కు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రి బీఎల్.వర్మ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, గంగిడి మనోహర్‌రెడ్డి, వేముల అశోక్, బూర నర్సయ్య, గూడూరు నారాయణరెడ్డి, ఉట్కూరు అశోక్‌గౌడ్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
