నవంబర్ 2025లో భారత ప్యాసింజర్ కార్ల అమ్మకాల జోరు అదరహో పండగ తర్వాత కూడా కొనసాగింది. ఏడాది ప్రాతిపధికన గతంతో పోల్చితే గణనీయమైన వృద్ధి నమోదైంది. ఈసారి అమ్మకాల్లో 'టాటా నెక్సాన్ (ICE+EV)' అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. నవంబర్‌లో టాటా నెక్సాన్ 22,434 యూనిట్ల అమ్మకాలతో అగ్ర స్థానం దక్కించుకుంది. కాంపాక్ట్ SUV విభాగంలో దీని పాపులారిటీ కారణంగా పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వంటి పలు పవర్‌ట్రైన్ ఆప్షన్లు మోడల్ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మార్కెట్‌లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని చాటుకునే మారుతి సుజుకి.. ఈ టాప్-10 అమ్ముడైన మోడళ్లలో ఏకంగా ఆరు స్థానాలను దక్కించుకుని తన సత్తాను నిరూపించింది. మారుతి సుజుకి డిజైర్ 21,082 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. డిజైర్ విక్రయాలు ఏకంగా 78.98% భారీ వృద్ధిని సాధించడం ఈ నెలలో హైలైట్‌గా నిలిచింది. దీని తర్వాత సుజుకి స్విఫ్ట్ 19,733 యూనిట్లతో మూడో స్థానంలో, మారుతి ఎర్టిగా 16,197 యూనిట్లు అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచాయి. ఇక ఫ్రాంక్స్ 15,058 యూనిట్లు, వ్యాగన్ R 14,619 యూనిట్లు, బ్రెజా 13,947 యూనిట్ల అమ్మకాలతో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను దక్కించుకున్నాయి.
ALSO READ : పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లతో జాగ్రత్త..
టాటా మోటార్స్ నుంచి వచ్చిన మరో కాంపాక్ట్ SUV అయిన టాటా పంచ్ 18,753 యూనిట్లతో నాలుగో స్థానంలో దూసుకుపోయింది. దీని తర్వాత హ్యుందాయ్ క్రెటా 17,344 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచి, మిడ్-సైజ్ SUV విభాగంలో తన పట్టును నిలుపుకుంది. అలాగే మహీంద్రా నుంచి వచ్చిన దృఢమైన SUVలు స్కార్పియో-N, స్కార్పియో క్లాసిక్ కలిసి 15,616 యూనిట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
మొత్తంగా నవంబర్ 2025 అమ్మకాలు SUVల ఆధిపత్యాన్ని, అలాగే మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రధాన తయారీదారుల మధ్య తీవ్రమైన పోటీని సూచిస్తున్నాయి.

