వారంలో నాలుగు రోజులే పని!

వారంలో నాలుగు రోజులే పని!

ఢిల్లీ : కొత్త ఏడాదిలో సరికొత్త వర్క్ కల్చర్ అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక విధానాన్ని రూపొందించింది. అది అమల్లోకి వస్తే ఉద్యోగులు వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేసే వీలు ఉంటుంది. మరో మూడు రోజులను వీకాఫ్ గా పరిగణించనున్నారు. వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని చేసే పరిస్థితులకు సంబంధించి కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్ లను అమలు చేయాలని భావిస్తోంది. వీటన్నింటిపై సర్కారు ఇప్పటికే తుది నిర్ణయం తీసుకుంది. కానీ కార్మిక వ్యవస్థ ఉమ్మడి జాబితాలోని అంశం అయినందున అమలుపై మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. 

4 పని దినాలు.. 3 రోజులు సెలవు
కొత్త కార్మిక విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులకు వారంలో నాలుగు పని దినాలు మాత్రమే ఉంటాయి. మిలిగిన మూడు రోజులను వీక్లీ ఆఫ్ గా పరిగణిస్తారు. వారానికి 48గంటల పని విధానం అమల్లో ఉన్నందున ఉద్యోగులు ఆ నాలుగు రోజులు 12 గంటల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త కార్మిక విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రతిపాదించిన వర్క్ కల్చర్ కు సంబంధించి 12 రాష్ట్రాలు ఇప్పటికే డ్రాఫ్ట్ రూల్స్ వెల్లడించాయి.  ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ ఈ లిస్టులో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ సైతం కొత్త విధానానికి ఇప్పటికే ఓకే చెప్పింది.

తగ్గనున్న టేక్ హోమ్ జీతం
కొత్త విధానం అమల్లోకి వస్తే ఉద్యోగుల టేక్ హోమ్ జీతం తగ్గనుంది. కొత్త కార్మిక చట్టాల కారణంగా కంపెనీలు ఉద్యోగుల సీటీసీలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఎల్టీఏ, హౌస్ రెంట్ అలవెన్స్, ఓవర్ టైం, రవాణా ఛార్జీలు తదితరాలను సీటీసీలో 50శాతానికి పరిమితం చేయాల్సి ఉంటుంది. కొత్త కోడ్ ప్రకారం కేంద్రం వేతనాలు అనే పదానికి నిర్వచనాన్ని మార్చింది. దాని ప్రకారం వేతనాల్లో బేసిక్ పే, డీఏ, రిటెన్షన్ పేమెంట్ లను మాత్రమే చేర్చనున్నారు. హెచ్ఆర్ఏ, రవాణా భత్యం, పెన్షన్, పీఎఫ్ కంట్రిబ్యూషన్, ఓవర్ టైం, గ్రాట్యూటీ, స్టాట్యుటరీ బోనస్ లను వేతనాల నిర్వచనం నుంచి తప్పించనున్నారు. వీటన్నింటినీ సీటీసీలో 50శాతానికి మించకుండా చేయనున్నారు. ఫలితంగా ఉద్యోగికి చేతికి వచ్చే జీతం తగ్గనుంది. కానీ పీఎఫ్, గ్రాట్యూటీ మొత్తం పెరగనుంది. 

మారనున్న ఓవర్ టైం రూల్స్ 
కేంద్రం ప్రతిపాదించిన కోడ్ ప్రకారం ఓవర్ టైం రూల్స్ కూడా మారనున్నట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం ఉద్యోగి తన విధులు పూర్తయ్యాక 15 నిమిషాలకు మించి పనిచేయాల్సి వస్తే దాన్ని ఓవర్ టైం కింద పరిగణించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు ఆ ఓవర్ టైంకు అదనంగా వేతనం చెల్లించాల్సి ఉంటుంది.