ఈసారి కూడా రెండు విడతల్లో రంజీ మ్యాచ్‌‌‌‌లు

ఈసారి కూడా రెండు విడతల్లో రంజీ మ్యాచ్‌‌‌‌లు

న్యూఢిల్లీ: ఇండియా డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ 2026–27 సీజన్‌‌‌‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీని ఈసారి కూడా రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో కొత్త దేశవాళీ సీజన్‌‌‌‌కు తెరలేవనుంది. అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌‌‌‌లు ప్రారంభం కానున్నాయి. జనవరి 17 నుంచి మార్చి 3, 2027 వరకు రెండో విడత మ్యాచ్‌‌‌‌లను నిర్వహిస్తారు. వివిధ వయోపరిమితి విభాగాలతో పాటు సీనియర్ స్థాయిలో మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ క్రికెట్ జట్లకు కలిపి ఈ సీజన్‌‌‌‌లో మొత్తం 1,788 మ్యాచ్‌‌‌‌లను బీసీసీఐ నిర్వహించనుంది. 

జోనల్ పద్ధతిలో జరగనున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌‌‌‌లు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరుగుతాయి. ఈ టోర్నీ మ్యాచ్‌‌‌‌లన్నీ బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' వేదికగా జరగనున్నాయి. ప్రస్తుత రంజీ ట్రోఫీ చాంపియన్ జమ్మూ కాశ్మీర్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక ఇరానీ కప్ మ్యాచ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు శ్రీనగర్‌‌‌‌లో జరుగుతుంది. రంజీ తొలి రౌండ్‌‌‌‌ తర్వాత సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 ట్రోఫీ (నవంబర్‌‌‌‌ 14 నుంచి డిసెంబర్‌‌‌‌ 6 వరకు) జరుగుతుంది. ఐపీఎల్‌‌‌‌ వేలానికి ముందు ఈ టోర్నీ ఉండటంతో కొత్త ప్రతిభను గుర్తించేందుకు ఫ్రాంచైజీలకు మంచి అవకాశం. డిసెంబర్‌‌‌‌ 14 నుంచి జనవరి 8, 2027 వరకు విజయ్‌‌‌‌ హజారే వన్డే ట్రోఫీ ఉంటుంది.