చెత్త నుంచి ఇటుకలు చేసి కట్టిన మొట్టమొదటి ఇల్లు

చెత్త నుంచి ఇటుకలు చేసి కట్టిన మొట్టమొదటి ఇల్లు

ఒక్క ఐడియా ఎన్నో కొత్త కొత్త వాటిని కనిపెట్టడానికి కారణమవుతుంది. ఆ ఐడియా వెనక ఒక అవసరం ఉండొచ్చు. సొసైటికీ ఏదైనా అందించాలన్న తపన ఉండొచ్చు. అచ్చం అలానే  ఐఐటీ హైదరాబాద్​కు చెందిన స్కాలర్​ ప్రియాభ్రత​ రౌత్రే  ఆలోచించాడు.  దాన్నుంచి వచ్చిందే బయో బ్రిక్స్​ ఐడియా.  ఆ బ్రిక్స్​తో ఒక గార్డ్​ రూమ్​ను సక్సెస్​ఫుల్​గా కట్టి చూపించాడు. 

ఇల్లు కట్టాలంటే  సిమెంట్​, ఇటుకలు, ఇనుము.. ఇట్లా ఎన్నిటికో డబ్బు ఖర్చు చేయాలి. ముఖ్యంగా ఇటుకలను ఎక్కువ వాడాల్సి ఉంటుంది. ఒక్కో ఇటుక  దాదాపు పది రూపాయల వరకు ఉంటుంది. కానీ ప్రియాభ్రత​ తయారు చేసిన బయో బ్రిక్ వాడితే  ఖర్చు తగ్గడమే  కాకుండా, రైతులకు డబ్బులు కూడా తెచ్చి పెడుతుంది. అదేంటి!  బయోబ్రిక్స్​కు, రైతులకు సంబంధం ఏంటి? అనుకుంటున్నారా? చాలామంది రైతులు పంట పండిన తర్వాత  మొక్కల్ని వేస్ట్​గా పడేస్తారు.  లేదంటే వాటిని కాలుస్తారు.  వాటన్నింటినీ కలిపి  ‘బయో బ్రిక్స్​’  ( పర్యావరణానికి చేటు చేయని) తయారు చేశాడు ప్రియాభ్రత. పంట సాగు తర్వాత వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్ధతిలో మిక్స్‌‌ చేశాడు. 

ప్రియాభ్రత​ ఒడిషాకు చెందిన స్కాలర్​. భువనేశ్వర్​లో ఆర్కిటెక్చరల్​ డిజైన్​ కోర్సు చేశాడు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్​ రంగంలో పని చేస్తున్న టైంలోనే ఆర్కిటెక్చర్​, డిజైన్​ రంగంలో కొత్తగా, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్​ చేయాలన్నాడు. రీసెర్చ్​ మొదలుపెట్టాడు. ఒడిషా నుంచి వచ్చి ఐఐటీ హైదరాబాద్​లో డిజైన్​ డిపార్ట్​మెంట్​లో చేరాడు. 

2019 నుంచి  బయో బ్రిక్స్​ గురించి రీసెర్చ్​ చేయడం మొదలు పెట్టాడు. ఐఐటి హైదరాబాద్‌‌లో ‘బోల్డ్‌‌ యునిక్‌‌ ఐడియా లీడ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ (బిల్డ్‌‌)’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు  మొదలు పెట్టింది.  అందులో భాగంగా కన్​స్ట్రక్షన్​ ఫీల్డ్​లో ఇన్నొవేషన్స్​ స్టార్ట్​ చేశాడు.

బయో బ్రిక్స్​ 

రైతుల నుంచి సేకరించిన చెత్తతో బయోబ్రిక్స్​ తయారుచేస్తారు. పూర్వ కాలం బంకమట్టి వాడి బలమైన గోడలు ఎలా కట్టేవారో ఆ పద్ధతిలోనే పంట చెత్తను, జిగురు గుణం ఉన్న మొక్కలతో కలిపి పేస్ట్​లా తయారుచేశారు.  దాన్ని ఇటుకలా మారుస్తారు. సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు ఎనిమిదో వంతు బరువు  ఉంటాయి. ఇంటి పైకప్పు కట్టేందుకు వేసేందుకు  కూడా వీటిని వాడొచ్చు. పీవీసీ షీట్‌‌లపై ఈ ఇటుకలను వాడి రూఫ్​ వేస్తారు. -బయో ఇటుకలు వాటర్‌‌ ప్రూఫ్‌‌, ఫైర్‌‌ ప్రూఫ్‌‌గా పని చేస్తాయి. కాబట్టి బిల్డింగ్​కు రక్షణ ఉంటుంది. ఈ ఇటుకలతోనే ఐఐటి క్యాంపస్​లో సెక్యూరిటీ గార్డ్‌‌ రూమ్​ని కట్టాడు ప్రియాభ్రత. బయోబ్రిక్స్​ తయారీలో వరి గడ్డి, గోధుమ గడ్డి, చెరుకు పిప్పి, పత్తి మొక్కలు వంటి వాటిని చెత్తగా  వాడతారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే పంట చెత్తను కూడా వాడొచ్చు. వీటితో బయోబ్రిక్స్​కు కావాల్సిన మిశ్రమం తయారవుతుంది. దీన్ని అచ్చులో పోసి రెండు రోజుల తర్వాత కావాల్సిన సైజ్​లో మార్చుకోవాలి. ఈ ఇటుకలు తయారయ్యాక పూర్తిగా ఆరడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఆ తర్వాత వీటిని వాడొచ్చు. 

బయో బ్రిక్స్​.. అందరికీ అందుబాటులోకి వస్తే.. ఊళ్లలో వాళ్లకు ఎంతో ఉపయోగం. పంట చెత్తతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు చేయొచ్చు. వీటి వల్ల ఇల్లు కట్టుకునే ఖర్చు తగ్గుతుంది. అలాగే మట్టి ఇటుకలను కాల్చేటప్పుడు వచ్చే పొగవల్ల వాతావరణం కలుషితం అవుతుంది. బయో బ్రిక్స్​ వల్ల వాతావరణం కలుషితం కాదు కూడా.

త్వరలోనే అందుబాటులోకి..

పంట చెత్తతో తయారు చేసిన బయోబ్రిక్స్ ప్రాజెక్ట్​ ​ ప్రస్తుతం ప్రొటో టైప్​ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్​కు మినిస్ట్రీ ఆఫ్ రూరల్​ ​ డెవలప్​మెంట్​ ఇండియా నుంచి కూడా మంచి రెస్సాన్స్​ వచ్చింది.  ఈ ఇటుకలను కమర్షియల్‌‌గా పెద్ద ఎత్తున తయారు చేస్తే పంట చెత్తను అమ్మడం ద్వారా రైతులకు ఆదాయం. మరో వైపు ఇల్లు కట్టుకునే వాళ్లకు ఖర్చు తగ్గుతుంది. ఒక్కో ఇటుక తయారీకి రెండు  నుంచి మూడు రూపాయల వరకు ఖర్చవుతుంది. 
-  ప్రియాభ్రత​ రౌత్రే

 

::: వినోద్ మామిడాల