V6 News

మారని ఇండిగో తీరు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో.. 58 విమానాలు రద్దు

మారని ఇండిగో తీరు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో.. 58 విమానాలు రద్దు

హైదరాబాద్‌: ఇండిగో సంక్షోభం మంగళవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రోజు కూడా.. శంషాబాద్‌ విమానాశ్రయానికి రావాల్సిన 14 విమానాలు, శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 44 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ముందస్తు సమాచారం కూడా లేకుండా ఉన్నపళంగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వైజాగ్ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులు రద్దు కావడం గమనార్హం. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌డీటీఎల్) నిబంధనలు నవంబర్ నుంచి అమలులోకి రావడంతో, పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది.

ఒక పైలెట్‌ రోజులో  రాత్రి 12 నుంచి ఉదయం 6  మధ్య  రెండు ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. వారంలో  కనీసం 36 గంటలు రెస్ట్‌ ఇవ్వాలి. నైట్ డ్యూటీ తరువాత 12 గంటల విరామం​ తప్పనిసరి. పైలెట్లతో పాటు ఇతర సిబ్బంది సంఖ్య కూడా తగ్గింది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌‌‌వేర్ లోపం వల్ల కూడా అంతరాయాలు ఏర్పడినట్లు ఇండిగో పేర్కొంది. చలి కాలం రావడం, ప్రతికూల వాతావరణం, రద్దీ వల్ల కూడా విమానాలను రీషెడ్యూల్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.

ప్యాసింజర్లకు ఇప్పటి వరకు రూ.610 కోట్ల రీఫండ్‌‌‌ను ఇండిగో చెల్లించినట్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే 3 వేల లగేజీ బ్యాగ్‌‌లను ప్రయాణికులకు తిరిగి అందజేసినట్టు తెలిపింది. రీషెడ్యూలింగ్ ఫ్లైట్లకు సంబంధించి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదని, రీఫండ్, రీబుకింగ్ కోసం ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసిందని అని విమానయాన శాఖ తెలిపింది.