పెద్ద ప్రమాదం తప్పింది..గాల్లో ఉన్నప్పుడే విమానం ఇంజన్ ఫెయిల్

పెద్ద ప్రమాదం తప్పింది..గాల్లో ఉన్నప్పుడే విమానం ఇంజన్ ఫెయిల్

ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్​లో సమస్య
ముంబై ఏటీఎస్​కు పైలెట్ల ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ మెసేజ్
క్లియరెన్స్ రాగానే సేఫ్ ల్యాండింగ్

ముంబై: ఢిల్లీ నుంచి గోవా బయల్దేరిన ఇండిగో ఫ్లైట్.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. గాల్లో ఉన్నప్పుడే ఒక ఇంజన్ ఫెయిల్ కావడంతో పైలెట్లు వెంటనే ముంబై ఏటీఎస్​కు ‘ప్యాన్‌‌.. ప్యాన్‌‌.. ప్యాన్‌‌’ అని మెసేజ్ పంపారు. అక్కడి అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టులో ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ అయింది అని ఇండిగో  సిబ్బంది తెలిపారు. 

ఎయిర్​బస్ ఏ320 నియో (6ఈ–6271) విమానం సుమారు 191 మందితో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి బుధవారం రాత్రి బయల్దేరింది. భువనేశ్వర్​కు 180 కిలో మీటర్ల దూరంలో ఆకాశంలో ఉన్నప్పుడు ఒక ఇంజన్ పని చేయకపోవడాన్ని పైలెట్లు గుర్తించారు. వెంటనే ప్రయాణికులకు సమాచారం ఇచ్చి ఫ్లైట్​ను ముంబైకు దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. 

ముంబై ఏటీఎస్​కు ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్..’ అని సమాచారం పంపారు. వాళ్ల దగ్గరి నుంచి పర్మిషన్ రాగానే.. రాత్రి 9.52కు సేఫ్ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని ఇండిగో ప్రతినిధి వివరించారు. టెక్నికల్​ టీమ్ ఫ్లైట్​ను పరిశీలించింది. ప్రయాణికులకు వేరే విమానం ఏర్పాటు చేసి గోవాకు తరలించామని తెలిపారు. 

ప్యాన్.. ప్యాన్.. ప్యాన్ అంటే ఏంటి?

‘మేడే.. మేడే.. మేడే..’ అని కాక్​పిట్ నుంచి ఏటీఎస్​కు సమాచారం వెళ్లిందంటే ఫ్లైట్​ ప్రమాదంలో ఉందని అర్థం. ‘ప్యాన్‌‌.. ప్యాన్‌‌.. ప్యాన్‌‌’ అనేది విమానంలో ఎమర్జెన్సీని సూచించే రేడియో డిస్ట్రెస్‌‌ కాల్‌‌. ఆకాశంలో ఉన్నప్పుడు ఇంజన్​లో సమస్య తలెత్తితే.. పైలట్‌‌ ఈ మెసేజ్‌‌ను పంపిస్తారు. ప్యాన్ అనేది ఫ్రెంచ్ పదం. ‘బ్రేక్‌‌ డౌన్‌‌’ అని దీని అర్థం. రెండు ఇంజన్లలో ఒక ఇంజన్‌‌ ఫెయిల్ అయి.. మరొకటి పని చేస్తున్నప్పుడు ఈ సందేశం పంపిస్తారు.

ఇండిగో ఫ్లైట్​లో సాంకేతిక లోపం

న్యూఢిల్లీ: ఇంఫాల్ నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయిన మరో ఇండిగో ఫ్లైట్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్​పోర్టులో ల్యాండ్ చేశారు. మైనర్ టెక్నికల్ ఇష్యూ కారణంగానే ఫ్లైట్​ను రిటర్న్ ఢిల్లీలో ల్యాండ్ చేసినట్లు ఇండిగో ఎయిర్​లైన్స్ ప్రతినిధి తెలిపారు. 6ఈ–5118 ఇండిగో ఫ్లైట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి ఉదయం 10:45కు ఇంఫాల్​కు టేకాఫ్ అయింది. 

కొద్దిసేపటికి ఇంజిన్​లో సమస్య తలెత్తడంతో అధికారులకు. చెప్పగా, వారు ఫ్లైట్​ను రిటర్న్ తీసుకురావాలని పైలెట్లకు సూచించారు. సుమారు గంట పాటు గాల్లోనే ఉన్న విమానం.. 11:50కు ఢిల్లీలో సేఫ్ ల్యాండ్ అయింది. విమానంలో 185 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.