కమ్మేసిన పొగ మంచు.. ముంబైలో దిగాల్సిన విమానం ఢాకాలో ల్యాండింగ్

కమ్మేసిన పొగ మంచు.. ముంబైలో దిగాల్సిన విమానం ఢాకాలో ల్యాండింగ్

ముంబై: వాతావరణ ప్రతికూల పరిస్థితులు పలు చోట్ల విమానాల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. శనివారం తెల్లవారుజామున గౌహతి ఎయిర్ పోర్టును  దట్టమైన పొగమంచు కమ్మేసింది. దాంతో  ముంబై నుంచి గౌహతికి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్​ను అధికారులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్​తో ప్యాసింజర్లు విమానంలోనే  కొన్ని గంటలపాటు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

6ఈ5319 ఇండిగో విమానం 178 మంది ప్యాసింజర్లతో  ముంబై నుంచి గౌహతి బయలుదేరింది. కానీ గౌహతి ఎయిర్ పోర్టును దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాన్ని బంగ్లాదేశ్​కు మళ్లించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢాకాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికుల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి సూరజ్ సింగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. "రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు వెళుతున్నా. కానీ, అత్యవసర ల్యాండింగ్ వల్ల బంగ్లాదేశ్​లో చిక్కుకుపోయాం. 12 గంటల పాటు ప్రయాణికులంతా విమానంలోనే కూర్చొని ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇండిగో ఏర్పాట్లను చూసి యూరప్ చేరుకుంటానేమో అని భయపడ్డా. కానీ చివరకు గౌహతిలోనే ల్యాండ్ అయ్యాను. మేరా దేశ్ మహాన్. ఇండిగో 6ఈకి  ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. ఘటనపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. "ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాన్ని మళ్లించాం"  అని పేర్కొంది.