
పాట్నా: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చాలా మంది నేతలను జైలులో పెట్టించారని, కానీ ఆమె ఎప్పుడూ, ఎవరినీ అవమానించలేదని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. తను సీనియర్ జర్నలిస్టు నలిన్ వర్మ కలిసి రాసిన ‘‘ది సంఘ్ సైలెన్స్ఇన్1975” అనే వ్యాసాన్ని లాలూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ టైమ్లో తాము అనుభవించిన పరిస్థితులను.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిని బేరీజు వేశారు.
1975 దేశ ప్రజస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ.. 2024లో లాగా ప్రతిపక్ష నేతలను హీనంగా చూడలేదన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన, మాట్లాడిన ప్రతిపక్ష నేతలను ఇందిర, ఆమె మంత్రులు ఏరోజూ దేశ వ్యతిరేకులు అని దుర్భాషలాడలేదని అని గుర్తుచేశారు. ఈరోజు స్వేచ్ఛ విలువ గురించి ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, నడ్డా ఇతర కేంద్ర మంత్రుల పేర్లు కూడా అప్పుడు తాము కనీసం వినలేదని పేర్కొన్నారు.