- రూ.6 కోట్లతో ఏర్పాటు చేసేలా కార్యాచరణ
- 37 లొకేషన్లలో 565 షాపులు,27 రకాల వ్యాపారాలు చేసుకునేలా ఏర్పాట్లు
- మంత్రి సీతక్క చొరవతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు లబ్ధి
హైదరాబాద్, వెలుగు: మేడారం జాతరలో మహిళా శక్తి స్టాల్స్ కొలువుతీరనున్నాయి. రూ.6 కోట్ల వ్యయంతో మొత్తం 565 షాపులు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. 37 లొకేషన్లలో 27 రకాల వ్యాపారాలు నెలకొల్పేందుకు నిర్ణయించారు. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్స్, మేడారం రాకపోకలు జరిగే మార్గంలో 63 యూనిట్స్ ఏర్పాటు కానున్నాయి. మిగిలిన యూనిట్స్ ఇతర చోట్ల నెలకొననున్నాయి.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెర్ప్ బ్యాంకు లింకేజీ రూ.341.30 లక్షలతో 315 యూనిట్స్, సెర్ప్ సీఐఎఫ్ నిధులు రూ.86.50 లక్షలతో 80 యూనిట్స్, స్త్రీనిధి రూ.92 లక్షలతో 90 యూనిట్స్, మండల సమాఖ్య సీఐఎఫ్ రూ.64 లక్షలతో 60 యూనిట్స్, గ్రామ సమాఖ్య నిధులు రూ.19.50 లక్షలతో 20 యూనిట్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. మంత్రి సీతక్క చొరవతో మేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా ఈ ప్రాంత ఎస్‌హెచ్‌జీ మహిళలు లబ్ధి పొందనున్నారు.
ఆయా స్టాల్స్‌లో ఇప్ప పువ్వు లడ్డూలు, మిల్లెట్ లడ్డూలు, రాగి లడ్డూలు, పల్లీ లడ్డూలు, ఇప్ప నూనె, కారం, పసుపు, మసాలా యూనిట్స్, రాగి జావ, టిఫిన్, రొట్టెల యూనిట్, మిల్లెట్ షేక్, స్వీట్ కార్న్, పాప్ కార్న్, టీ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్లు, పూజా సామగ్రి, బేకరీ, బ్యాంబు చికెన్, చికెన్, క్లాత్ రెడీ మేడ్ డ్రెస్సెస్, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహర, కిరాణా జనరల్ స్టోర్, కూల్ డ్రింక్స్, పాలు, ఫాస్ట్ ఫుడ్, మొబైల్ ఫిష్, కర్రీ అవుట్ లెట్, కోళ్ల విక్రయ అవుట్ లెట్, కోడి గుడ్ల స్టాల్స్ విక్రయించనున్నారు.
